Supreme Court WhatsApp Number: టెక్నాలజీకి తగ్గట్టుగా అప్‌డేట్‌ అయ్యేందుకు సిద్ధమవుతోంది సుప్రీంకోర్టు. ఇకపై అడ్వకేట్స్‌కి ఇవ్వాల్సిన సమాచారాన్నంతా వాట్సాప్ ద్వారా పంపనుంది. కేసుల లిస్టింగ్, ఫైలింగ్, విచారణకు సంబంధించిన వివరాలు ఆయా న్యాయవాదులకు వాట్సాప్‌ ద్వారా పంపుతామని CJI డీవై చంద్రచూడ్ వెల్లడించారు. ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చా లేదా అన్న కేసుపై విచారణ జరుగుతున్న సమయంలోనే చంద్రచూడ్‌ ఇది ప్రకటించారు. 9 మంది సభ్యులతో కూడిన ధర్మాసనం ముందు ఈ విషయం వెల్లడించారు. న్యాయ సేవల్ని మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. 


"75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనున్న ఈ ఏడాదిలోనే సుప్రీంకోర్టు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయ సేవల్ని మరింత సులభతరం చేయడంలో భాగంగా సుప్రీంకోర్టులోని ఐటీ సర్వీస్‌లను వాట్సాప్‌తో అనుసంధానించనుంది"


- డీవై చంద్రచూడ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 


వాట్సాప్‌తో అనుసంధానించిన తరవాత న్యాయవాదులకు ఆటోమేటెడ్ మెసేజ్‌లు వెళ్తాయి. కేస్‌లు ఫైలింగ్‌కి సంబంధించిన వివరాలు అందులో ఉంటాయి. cause list లు పబ్లిష్ అయిన తరవాత ఆ కాపీలు కూడా వాట్సాప్ ద్వారా పంపుతామని చంద్రచూడ్‌ వివరించారు. కోర్టులో ఓ రోజు ఏయే కేసుల విచారణ జరుగుతుందో చెప్పేదే ఈ కాజ్ లిస్ట్. ఈ నిర్ణయంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందించారు. ఇదో చరిత్రాత్మకమైన నిర్ణయం అంటూ ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే సుప్రీంకోర్టులోని కీలక వ్యక్తి వాట్సాప్‌ నంబర్‌ని అందరికీ ఇచ్చారు జస్టిస్ చంద్రచూడ్. అయితే...ఆ నంబర్‌కి మెసేజ్‌లు చేయడం, కాల్స్ చేయడం కుదరదని తెలిపారు. అన్ని వివరాలనూ ప్రింట్ తీసి అందరికీ ఇవ్వడం వల్ల పేపర్‌లు వృథా అవుతున్నాయని, కొంత వరకూ వాటి వాడకాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు. ఇదే సమయంలో  e-court project గురించీ ప్రస్తావించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.7 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు.