కరోనా కారణంగా అడుక్కునే వారిపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణలో సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఎవరూ ఇష్టపూర్వకంగా  అడుక్కోరని.. అదో సామాజిక సమస్య అని ధర్మాసనం అభిప్రాయపడింది. బెగ్గర్స్ ఇష్టారాజ్యంగా తిరుగుతూ ఉండటం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని...  అందుకే పబ్లిక్ ప్లేసుల్లో అడుక్కునేవాళ్లను నిషేధించేలా ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. దీనిపై విచారణ జరిగిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. వారిపై నిషేధం విధించేందుకు నిరాకరించింది.  యాచన అనేది సామాజిక- రాజకీయ సమస్య అని.. కడుపు నింపుకోవడం కోసం వేరే దారి లేక వారు ఆ పని చేస్తున్నారని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. జస్టిస్ చంద్రచూడ్ , జస్టిస్ డీ వై షాలతో కూడిన ధర్మాసనం...  కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 


ఢిల్లీ ప్రభుత్వం కూడా బెగ్గర్స్‌కు వ్యాక్సినేషన్ వేయించాలన్న పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండింటిపై..కేంద్ర ప్రభుత్వ స్పందన చెప్పాలని.. సుప్రీంకోర్టు ఆదేశించింది. రోడ్లుపై తిరుగుతున్న యాచకులకు ఆహారం.. పునరావాసం కల్పిచడంతో పాటు వారికి వ్యాక్సినేషన్ వేసే అంశంపై వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. యాచకుల విషయంలో తాము మానవత్వంతో.. ఉన్నతంగా ఆలోచిస్తామని స్పష్టం చేసింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మొహతాను ఈ విషయంలో కోర్టుకు సహాయకారిగా ఉండాలని ధర్మాసనం సూచించింది.  కేంద్ర ప్రభుత్వ స్పందనను బట్టి సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. 



కరోనా కాలంలో అనేక మంది నిరుపేదలుగా మారిపోయారు. రోజు కూలీ చేసుకునేవారు.. వలస కూలీలు.. అనేక మంది..  ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ కారణంగా ఎక్కువ మంది యాచన వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవలి కాలంలో ఢిల్లీ లాంటి నగరాలలో యాచకులు పెరిగిపోయారన్న అంచనాలు వచ్చాయి. ఈ తరుణంలో వారిని నిషేధించాలని పిటిషన్ దాఖలు చేయడం..  సుప్రీంకోర్టు మానవత్వంతో వ్యవహిరంచాలని సూచించడం ఆసక్తికరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం వారికేమైనా సంక్షేమ పథకాలు అమలు చేసి.. పునరావాసం కల్పిస్తే.. బెగ్గర్లు కాస్త తగ్గే అవకాశం ఉంది. కేంద్రం ఏం చెబుతుందో... రెండు వారాల్లో తేలే అవకాశం ఉంది. 


అయితే దేశంలో పలు చోట్ల బెగ్గింగ్ మాఫియాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ముఠాలు ప్రత్యేకంగా బెగ్గర్లను సిద్ధం చేసి ..  మెట్రో నగరాల్లో వదులుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. చాలా సార్లు అలాంటి రాకెట్లను పట్టుకున్నా... నిజమైన బెగ్గర్లు కూడా పెద్ద ఎత్తున ఉన్నారన్న లెక్కలు కూడా ఉన్నాయి.  ముష్టి మాఫియాను  తప్పించి... మిగిలిన వారికి న్యాయం చేయగలిగితే.. దేశంలో చాలా వరకు యాచకుల సమస్య తీరిపోయే అవకాశం ఉంది.