Centre Fact Check Unit: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వదంతులు వ్యాప్తి చెందకుండా వాటిని అరికట్టేందుకు  Press Information Bureau పరిధిలో ఓ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ (Fact Check Unit) ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయితే...సుప్రీంకోర్టు ఈ నోటిఫికేషన్‌ని నిలిపివేసింది. ఈ యూనిట్‌ని ఏర్పాటు చేసుకునేందుకు బాంబే హైకోర్టు అనుమతినిస్తూ ఇచ్చిన తీర్పుని కొట్టి వేసింది. చీఫ్‌ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా భావ ప్రకటనా స్వేఛ్చ గురించి ప్రస్తావించింది. స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కేంద్రం ప్రకటనను వ్యతిరేకిస్తూ బాంబే హై కోర్టులో పిటిషన్ వేశాయి. కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ని ఏర్పాటు చేయకుండా అడ్డుకోవాలని కోరింది. 


గతేడాది కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్టంలో కీలక సవరణలు చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం వదంతుల వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం ప్రత్యేకంగా ఓ యూనిట్‌ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. ప్రభుత్వానికి సంబంధించిన కీలక వివరాలను తప్పుదోవ పట్టించినా, తప్పుడు ప్రచారం చేసినా ఈ యూనిట్‌ వాటిపై ఫ్యాక్ట్ చెక్ చేస్తుందని తెలిపింది. ఆ మేరకు ఆయా సోషల్ మీడియా సంస్థల్ని అప్రమత్తం చేస్తామని స్పష్టం చేసింది. ఆయా అకౌంట్స్‌ని తొలగించేందుకూ ఇది వీలు కల్పిస్తుందని వెల్లడించింది. ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి సోషల్ మీడియా సంస్థలు పని చేయాలని తేల్చి చెప్పింది. బాంబేహైకోర్టు ఈ యూనిట్‌ని ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పింది. అందుకే ఈ సారి పిటిషనర్లు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం వెంటనే నిలిపివేయాలని తెలిపింది.