న్యాయమూర్తులపై వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్న ఫిర్యాదులపై సీబీఐ, ఇంటలిజెన్స్ బ్యూరో తగిన విధంగా స్పందించడం లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లో న్యాయమూర్తిని ఆటోతో ఢీ కొట్టి హత్య చేసిన ఘటనపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. విచారణలో చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం.. సీబీఐ, ఐబీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయమూర్తుల ఫిర్యాదుల విషయంలో ఏమీ చేయడం లేదని.. ఏమైనా చేస్తారని కూడా ఎక్స్‌పెక్ట్ చేయడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 


న్యాయమూర్తులను కేవలం శారరీరకంగా మాత్రమే కాదని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం ద్వారా మానసికంగా కూడా వేధిస్తున్నారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో సీబీఐ విచారణకు ఆదేశించినా ఎలాంటి ఫలితం ఉండటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో న్యాయమూర్తులను అత్యంత దారుణంగా కించ పరుస్తూ కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై విచారణ జరపాలని ఏపీ హైకోర్టు సీబీఐనిఆదేశించింది. అయితే ఆ కేసులో ఇంత వరకూ సీబీఐ పెద్దగా దర్యాప్తు చేసిందేమీ లేదు. ఇటీవలి కాలంలో ఒకరిద్దర్ని అరెస్ట్ చేసింది. కానీ ఆకేసును చేధించడంలో మాత్రం ఎలాంటి ముందడుగు పడలేదు.  న్యాయమూర్తులపై దాడులకు సంబంధించి విచారణలకు ఆదేశించినా సీబీఐ ఏమీ చేయడం లేదని.. మార్పు వస్తుందని తాము ఆశిస్తున్నా.. అది వాస్తవంలోకి రావడం లేదని సీజేఐ వ్యాఖ్యానించారు.  


తీర్పులు వ్యతిరేకంగా ఇచ్చిన న్యాయమూర్తులను కించ పర్చడం అనేది దేశంలో కొత్త ట్రెండ్‌గా మారిందని సీజేఐ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులపై ఫిర్యాదులు చేసినా.. ప్రయోజనం ఉండటం లేదు.. న్యాయవ్యవస్థకు సీబీఐ, ఐబీ సహకరించడం లేదని స్పష్టం చేశారు. ఈ కామెంట్లను తాను పూర్తి బాధ్యతతో చేస్తున్నట్లుగా అటార్నీ జనరల్‌కు సీజేఐ స్పష్టం చేశారు. జార్ఖండ్ న్యాయమూర్తి హత్య కేసులో సోమవారం కల్లా పూర్తి స్థాయి విచారణ నివేదికను సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయస్థానాలు, న్యాయమూర్తులకు రక్షణ కల్పించే అంశంపై 2019లో దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వ స్పందనను కూడా తెలియచేయాలని అటార్నీ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది. అప్పట్నుంచి నుంచి కేంద్రం ఈ అంశం అఫిడవిట్ దాఖలు చేయలేదని సీజేఐ గుర్తు చేశారు.  


జార్ఖండ్ న్యాయమూర్తి హత్య ఘటన వ్యవస్థ వైఫల్యమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే ఘటన జరిగిన వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని జార్ఖండ్ అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ కూడా వెంటనే విచారణ ప్రారంభించిందని కేంద్ర ప్రభుత్వ ఏజీ సుప్రీందృష్టికి తీసుకెళ్లారు. దీంతో మీ పనైపోయిందని అనుకుంటున్నారా..? అని ధర్మాసనం వారిని ప్రశ్నించింది.