Supreme Court on Uttarakhand Eviction:


రాత్రికి రాత్రే వెళ్లగొట్టలేం: సుప్రీం కోర్టు


ఉత్తరాఖండ్‌లోని హల్‌ద్వాని ప్రాంతంలో రెండు రోజులుగా అలజడి కొనసాగుతోంది. తమ భూముల్ని ఆక్రమించి నివాసం ఉంటున్నారంటూ అక్కడి ప్రజలపై ఇండియన్ రైల్వేస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే వేలాది మంది తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత చలికాలంలో తాము ఎక్కడికెళ్లి ఉంటామంటూ నిరాశ్రయులంతా ఆందోళన చేపడుతున్నారు. ఎంతో కాలంగా ఇక్కడ ఉంటున్నామని, ఇంటి పన్ను కూడా కడుతున్నామని చెబుతున్నారు. తమకు ఆధార్ కార్డ్ కూడా ఉందని అంటున్నారు. అయితే...ఉత్తరాఖండ్ హైకోర్టు మాత్రం ఇక్కడి అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశాలిచ్చింది. దీనిపై స్థానికులు సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. ఈ కేసు విచారణ చేపట్టిన ధర్మాసనం...ఇప్పటికిప్పుడు అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియను ఆపేయాలని ఆదేశించింది. ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు భిన్నంగా స్పందించింది. "రాత్రికి రాత్రే 50 వేల మందిని బయటకు పంపడానికి వీల్లేదు. ఇది కాస్త మానవత్వంతో ఆలోచించాల్సిన విషయం. మరేదైనా పరిష్కారం వెతుక్కోవాల్సిన అవసరముంది" అని వ్యాఖ్యానించింది.










ఆగిన కూల్చివేతలు..


ఈ తీర్పుతో అక్కడ తొలగింపు ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ప్రాంతంలో దాదాపు 4 వేల  ఇళ్లున్నాయి. ఆ ఇళ్లను కూల్చేందుకు అదనపు బలగాలను మోహరించాలన్న హైకోర్టు తీర్పునీ ప్రస్తావించింది సుప్రీం కోర్టు. "ఎన్నో దశాబ్దాలుగా అక్కడ ఉంటున్న వారిని బలవంతంగా అక్కడి నుంచి పంపేందుకు పారా మిలిటరీ బలగాలను రంగంలోకి దింపడం సరికాదు" అని తేల్చి చెప్పింది. ఇకపై ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశించింది. అదే సమయంలో...ఈ మొత్తం వివాదంపై ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో పాటు ఇండియన్ రైల్వేస్ వివరణ ఇవ్వాలని  వెల్లడించింది. వచ్చే నెల మరోసారి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. తాము చాలా పేదవాళ్లమని, దాదాపు 70 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు స్థానికులు. తమ పేర్లన్నీ మున్సిపల్ రికార్డ్‌లో ఉన్నాయని, క్రమం తప్పకుండా ఇంటి పన్ను కూడా కడుతున్నామని వెల్లడించారు. ఈ ప్రాంతంలో 5 ప్రభుత్వ పాఠశాలలు, ఓ ఆసుపత్రి, రెండు ట్యాంక్‌లు ఉన్నాయని తెలిపారు. స్వాతంత్య్రం రాక ముందు నుంచి కూడా తమ పూర్వీకులు ఇక్కడే ఉంటున్నారని ప్రస్తావించారు. 


Also Read: Ram temple In Ayodhya: వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి అయోధ్య రామ మందిరం సిద్ధం, ప్రకటించిన అమిత్‌షా