న్యాయమూర్తులు, లాయర్ల భద్రతకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలన్న ఆదేశాలను పట్టించుకోని రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జార్ఖండ్‌లో జడ్జి హత్య ఘటనపై సుమోటోగా విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు గత విచారణంలో న్యాయమూర్తులు, లాయర్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. వారి భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై అన్ని రాష్ట్రాలు ప్రత్యేక అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే.. ఏపీ, తెలంగాణ, జార్ఖండ్, మిజోరం, మణిపూర్ రాష్ట్రాలు మాత్రం అఫిడవిట్ లు దాఖలు చేయలేదు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. రూ. లక్ష జరిమానా విధిస్తామని ధర్మాసనం ప్రకటించింది. వారం రోజుల సమయం ఇచ్చామని.. బార్ కౌన్సిల్ కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. లేకపోతే చీఫ్ సెక్రటరీలు స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది.
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం న్యాయమూర్తుల భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. జడ్జిల భద్రత సంబంధించిన అంశాన్ని రాష్ట్రాలకు వదిలేయకుండా కేంద్రమే చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయమూర్తుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ వారిపై పదేపదే దాడులు జరుగుతున్నాయని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. జార్ఖండ్‌లోనే జడ్జి హత్య జరిగినా ఆ రాష్ట్ర ప్రభుత్వం తాము తీసుకుంటున్న భద్రత చర్యల స్థితిగతులను తెలియచేస్తూ అఫిడవిట్ దాఖలు చేయలేదు. జార్ఖండ్‌కు తీవ్రమైన సీసీటీవీల కొరత ఉందని, అవి కేవలం నేరం జరిగిన దృశ్యాలను మాత్రమే నమోదు చేస్తాయని ... కానీ నేరాలు, బెదిరింపులు జరగకుండా నిరోధించలేదని సుప్రీంకోర్టు తెలిపింది.
జార్ఖండ్ లోని ధన్ బాద్ లో జులై 28,2021 తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో జాగింగ్ చేస్తున్న జడ్జి ఉత్తమ్ ఆనంద్ ను ఆటో ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. న్యాయాధికారులు, న్యాయవ్యవస్థ తమ విధులు నిర్వర్తించేలా భద్రత, రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని.. కేంద్రం కూడా బాధ్యత తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది.
.
న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై శారీరకంగానే కాకుండా సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేయడం ద్వారా మానసిక దాడికి పాల్పడుతున్నారని. ఇలాంటి కేసుల్లో న్యాయస్థానాలకు సీబీఐ, ఐబీ వంటి దర్యాప్తు సంస్థలు సహకరిచడం లేదని గత విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా న్యాయమూర్తులపై వేధింపులకు సంబంధించిన కేసుల్లో సీబీఐ విచారణ ముమ్మరం చేసింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడిన వారిలో మరో ముగ్గుర్ని అరెస్టు చేసినట్లుగా ప్రకటించింది.