Suitcase Girlfriend : గర్ల్ ఫ్రెండ్ కు ఫ్యాంట్, షర్ట్ వేసి మగవాళ్ల హాస్టల్లో ఆశ్రయం పొందేలా చూస్తాడు ఓ ప్రేమికుడు. ఆ ప్రేమికురాల్ని తీసుకుని వచ్చేశాడు మరి. సిటీలో ఎవరూ తెలియదు. తెలిసిన ఫ్రెండ్ హాస్టల్లో ఉంటాడు.  అక్కడ ఉండాలంటే ఖచ్చితంగా మగవాడై ఉండాలి. అప్పటికి  పరిస్థితి గడవడానికి.. తన లవర్‌కు మగవేషం వేస్తాడు. ఆ తర్వాత జరిగే  కథ వేరు. ప్రేమలో పడితే అలాంటి సాహసాలు చేస్తారు. ఈ సినిమా చూశాడో లేకపోతే సహజంగా ప్రేమికులకు అలాంటి ఐడియాలు వస్తాయో కానీ హర్యానాలోని జిందాల్ యూనివర్శిటీలో ఓ విద్యార్థి ఇదే  తరహా ప్రయత్నం చేశాడు. కాకపోతే అది కాస్త వైల్డ్ గా ఉంది. హాస్టల్లోకి తీసుకెళ్లేందుకు సూట్ కేసులో సర్దేశాడు.  

 జిందాల్ యూనివర్శిటీలో చదువుకునే ఓ విద్యార్థి హాస్టల్ లో ఉంటున్నాడు. అతను రెండు రోజుల కిందట బయటకు వెళ్లాడు. వచ్చేటప్పుడు పెద్ద సూట్ కేసుతో వచ్చాడు. తన ఇంటి నుంచి  లగేజీ వచ్చిందని చెప్పుకున్నాడు. అదేమీ ఎయిర్పోర్టు కాదు కాబట్టి.. మొత్తం తీసి చూపించమని సెక్యూరిటీ అడగలేదు. దాంతో ఆ సూట్ కేసును తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ అతను ఆ సూట్ కేసును లాక్కెళ్లడానికి కూడా కష్టపడిపోయాడు. దీంతో సెక్యూరిటీకి అనుమానం వచ్చింది. తెరవడానికి అతను ఒప్పుకోలేదు కానీ.. బలవంతంగా తెరిచారు. ఆ సూట్ కేసులో ఓ అమ్మాయి ఉంది. 

కొన్ని కొన్ని క్రైమ్ న్యూసుల్లో గర్ల్ ఫ్రెండ్ ను చంపేసి సూట్ కేసులో సర్ది తీసుకెళ్లాడని చెబుతారు. కానీ ఇక్కడ లవర్ మాత్రం తన రూమ్ కు తెచ్చుకునేందుకు సూట్ కేసులో సర్దేశాడు. ఆమె కు గాలి ఆడే ఏర్పాట్లు చేశాడు కానీ.. బరువుగా ఉన్న ఆ సూట్ కేసును మోసుకెళ్లలేక దొరికిపోయాడు.  ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

హాస్టల్ కు గర్ల్ ఫ్రెండ్ ను తీసుకు వచ్చి ఏం చేద్దామనుకున్నాడో కానీ ఆ లవర్ మాత్రం అందరి ముందు సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. ఆ అమ్మాయి పరిస్థితి కూడా అంతే.