Stalin announces agitation if Delimitation Bill is passed: నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ స్థానాలను పెంచే ప్రక్రియను వేగవంతం చేస్తున్న తరుణంలో, స్టాలిన్ దీనిపై తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు.
స్టాలిన్ తుది హెచ్చరిక
ముఖ్యమంత్రి స్టాలిన్ తన తాజా వీడియో సందేశంలో కేంద్ర ప్రభుత్వానికి తుది హెచ్చరి ఇచ్చారు. కేవలం జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్ చేపడితే, దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కేవలం బెదిరింపు కాదు.. తమిళనాడు ఎన్నడూ చూడని రీతిలో ఒక మహా ఉద్యమాన్ని చూస్తారు. ప్రతి కుటుంబం వీధిలోకి వస్తుంది, రాష్ట్రం మొత్తం స్తంభిస్తుంది అని ఆయన ఘాటుగా హెచ్చరించారు. 1950, 60లలో హిందీ వ్యతిరేక ఉద్యమాల సమయంలో డీఎంకే చూపిన ఉధృతిని మరోసారి దేశం చూస్తుందని ఆయన సంకేతాలిచ్చారు.
జనాభా నియంత్రణకు శిక్ష వేస్తారా?
తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి జనాభాను నియంత్రించాయని, ఇప్పుడు జనాభా తక్కువగా ఉందని పార్లమెంట్‌లో సీట్లు తగ్గించడం అంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలను శిక్షించడమేనని స్టాలిన్ వాదిస్తున్నారు. జనాభా పెంచుకున్న రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు ఇచ్చి, నియంత్రించిన రాష్ట్రాలకు అన్యాయం చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తిపై దాడి అని, దక్షిణాదిని రాజకీయంగా బలహీనపరిచే కుట్రని స్టాలిన్ అంటున్నారు.
ఇండియా కూటమి విధానం సామాజిక న్యాయం
ఇండియా కూటమిలో కీలక సభ్యుడైన స్టాలిన్, ఈ విషయంలో కూటమి యొక్క గొంతుకగా మారారు. డిలిమిటేషన్ అనేది కేవలం అంకెల గారడీ కాకూడదని, అది రాజకీయ సమానత్వం కల్పించేలా ఉండాలని కూటమి డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రీడ్ మోడల్ జనాభాతో పాటు జిఎస్‌డిపి - GSDPని పరిగణనలోకి తీసుకోవడం పై కూటమిలో చర్చ జరుగుతోంది. రాష్ట్రాల మధ్య ఉన్న ఆర్థిక, సామాజిక వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు వెళ్తే తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని కూటమి స్పష్టం చేసింది.
మహిళా బిల్లును అడ్డు పెట్టుకుని పునర్విభజన చేస్తున్నారని విమర్శలు
మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలంటే డిలిమిటేషన్ తప్పనిసరి అని కేంద్రం చెప్పడాన్ని స్టాలిన్ తప్పుబడుతున్నారు. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ఆ పేరుతో దక్షిణాది రాష్ట్రాల సీట్ల వాటాను తగ్గించే ప్రయత్నాన్ని సహించబోమని ఆయన స్పష్టం చేశారు. మహిళా కోటాను నియోజకవర్గాల పెంపుతో సంబంధం లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
దేశవ్యాప్త ప్రచారం
రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, స్టాలిన్ హెచ్చరికలతో ఈ డిలిమిటేషన్ అంశం కేవలం తమిళనాడుకు పరిమితం కాకుండా మొత్తం దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి సమస్యగా మారుతోంది. ఇప్పటికే కేరళ, కర్ణాటక నేతలతో స్టాలిన్ సంప్రదింపులు జరుపుతున్నారు. కేంద్రం ఏకపక్షంగా ముందడుగు వేస్తే, ఉత్తరాది వర్సెస్ దక్షిణాది అనే భావన దేశ సమగ్రతకు భంగం కలిగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
