Bhogi Pidakalu for Pongal 2023: సంక్రాంతి పండగ అంటే ముందుగా గుర్తు వచ్చేది భోగి. అసలు పండగంటే నెల రోజుల ముందునుంచి హడావుడి మొదలవుతుంది. ధనుర్మాసం ప్రారంభించిన తరువాత భోగి రోజున వెలిగించే మంటల్లో పిడకలు వేయడం సాంప్రదాయం. వీధిలో వెలిగే భోగి మంటల్లో పిడకలు వేయనిదే భోగి చేసినట్టు ఉండదు. అలాంటిది రానురాను సాంప్రదాయాలు మారుతున్నాయి. అయినా తిరిగి పూర్వవైభానికి నాంది పలికేందుకు సిక్కోలు యువత, మహిళలు నడుం బిగిస్తున్నారు. భోగి అంటే స్వచ్ఛమైన ఆవుపేడతో తయారు చేసిన పిడకలను మంటల్లో వేస్తే ఆ ఆనందం ఆ ఆరోగ్యం వేరే అంటున్నారు. 

ఈ ఆధునిక రోజుల్లో, ఉరుకులు పరుగుల జీవితంతో కొన్ని సంప్రదాయాలు మూలన పడుతున్నాయి. అయినా సంక్రాంతి పండగంటే ప్రాధాన్యత తగ్గలేదు. అందులో భోగికి పట్టణాల్లో లేకపోయిన గ్రామాల్లో సందడి కనిపిస్తుంది. ఇటీవల అపార్టమెంట్లలో సామూహిక మంటలు చేసి డిజే సౌండ్లతో సందడి కనిపిస్తుంది. అయినా గ్రామీణ ప్రాంత వాతావరణం వేరేబ్బా అంటున్నారు. కొందరు మార్కెట్లో భోగి పిడకలు విక్రయాలు చేస్తుండడంతో డిమాండ్‌ పెరిగింది. కొంతమంది అవ్వలను తట్టితే భోగి మంట వెనుక ఎన్ని నులివెచ్చని జ్ఞాపకాలు దాగుంటాయంటారు.
కర్రల వేట నుంచి భోగి రాత్రి జాగారం వరకు చేసిన పనులు, పోగు చేసిన అనుభూతులు గుండె గదిలో శాశ్వతంగా నిలిచిపోతాయంటార పెద్దలు. కానీ నేటితరం అలాంటి జ్ఞాపకాలు మూటగట్టుకోవడంలో విఫలమవుతోందని ఆవేదన చెందుతున్నారు. కృత్రిమ రీతిలో పండగలు నిర్వహిస్తూ రెండు ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేయడానికి మాత్రమే పరిమితమవుతోందని ఆవేదన చెందుతున్నారు. కలిసికట్టుగా పండగ చేసుకోవడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించలేకపోతోందని, నేటి తరం సంప్రదాయ పండుగలకు దూరమవుతారనే ఆందోళన వెంటాడుతుందంటున్నారు. ఇలాంటి సాంప్రదాయాన్ని కొనసాగించడంతో పాటు పూర్వీకుల మాట తద్దీ మూట అంటారని అందుచేత వారు విడిచేపెట్టి వాటిని కొనసాగించాలని తపనతో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాక వాసులు మళ్లీ ఆ నాటి సంప్రదాయానికి జీవం పోస్తున్నారు.




పాశ్చాత్య మోజులో పడి మన సంస్కృతి, సంప్రదాయాలు, పండగలు, ఆచారాలను చాలా మంది పాటించడం తగ్గిస్తున్నారు. మన ఆచారాలను సజీవంగా నిలపాలని మురపాక గ్రామంలో వినూత్నంగా భోగి పిడకల పండగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో ఎవరైతే ఎక్కువ భోగి పిడకలను తయారుచేస్తారో వారికి భోగి పండగ రోజు ప్రత్యేక బహుమతులు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. దీంతో గ్రామంలోని మహిళలు, పిల్లలు, వృద్ధులు, పెద్దలు, రైతులు, యువకులు చాలా మంది గ్రామస్తులు కా ర్యక్రమంలో పాల్గొని బహుమతుల కోసం భోగి పిడకలు తయారు చేసేందుకు పోటీ పడుతున్నారు. చిన్నారులు అయితే ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రతిరోజూ గ్రామంలో ఆవుపేడను సేకరించి వాటితో పిడకలు తయారు చేస్తున్నారు. భోగి పండగ రోజు ఆవుపేడతో తయారు చేసిన పిడకలను కాల్చడం వలన పాజిటివ్ వైబ్రేషన్లు వస్తాయని, మనసుకు ప్రశాంతత కలుగుతుందని అంటున్నారు.
మురపాకలో సందడి ముందే వచ్చేసిందని స్థానికంగా వినిపిస్తోంది. గత ఏడాది కరోనాతో విలవిలాడిన జనానికి ఈసారి సంక్రాంతితో ఆ కష్టాలను పారదోలాలని మురపాక గ్రామస్థులు భావించారు. అనుకున్నదే తడువుగా గ్రామంలో అందరు కలిసికట్టుగా సమావేశం ఏర్పాటు చేసుకొ కొని భోగి పిడకల వేటలో దిగడంతో ఆ గ్రామంలో అప్పుడే పండగ వాతావరణం ఏర్పడింది. ఆ గ్రామాన్ని ఆదర్శంగా చేసుకుని ఊరూర పిడకలు తయారు చేసి ఈ సారి సంక్రాంతి పండగకు కొత్త శోభను తీసుకురావాలని మురపాక వాసులు భావిస్తున్నారు.