విమానంలో పొగలు..ఉక్కిరిబిక్కిరైన ప్రయాణికులు
దిల్లీ నుంచి జబల్‌పూర్ వెళ్లే స్పైస్‌జెట్ విమానాన్ని దిల్లీలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 5 వేల అడుగుల ఎత్తులో ఉండగా ఉన్నట్టుండి
విమానంలో పొగలు వచ్చాయి. ఇది గమనించిన సిబ్బంది వెంటనే దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. SG-2862స్పైస్‌జెట్ ఫ్లైట్ దిల్లీలో ఉదయం 6.15 నిముషాలకు బయల్దేరింది. టెక్నికల్ సమస్య కారణంగా మళ్లీ 7 గంటల వరకే దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు రిటర్న్ అయింది. క్యాబిన్ నుంచి పొగలు రావటాన్ని సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తం అవటం వల్ల ఎలాంటి ప్రమాదమూ జరగలేదని స్పైస్‌జెట్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని చెప్పారు. ప్రయాణికులు మాత్రం తాము ఎంతో ఇబ్బంది పడ్డామని అన్నారు. చాలా సేపటి వరకూ శ్వాస ఆడలేదని, ఊపిరి తీసుకోలేకపోయామని వివరించారు. లోపల ఉక్కపోత కారణంగా న్యూస్ పేపర్లు ఊపుకుంటున్న విజువల్స్‌నీ ఏఎన్‌ఐ వార్తా సంస్థ షేర్ చేసింది.
స్పైస్‌జెట్‌లో తరచూ ఎందుకిలా..?
ఇప్పుడే కాదు. గతంలోనూ ఇదే విధంగా స్పైస్‌జెట్ విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది. పాట్నా నుంచి దిల్లీ వెళ్తున్న విమానాన్ని ఉన్నట్టుండి అత్యవసర ల్యాండింగ్ చేశారు. పట్నాలోని బిహ్‌తా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద అత్యవసరంగా ల్యాండ్ అయింది. దిల్లీ వెళ్లాల్సిన స్పైస్ జెట్ ఫ్లైట్ పట్నాలో 12.10 గంటలకు టేకాఫ్ అయింది. అయితే గాల్లోకి వెళ్లిన కొద్ది సేపటికే ఎడమ వైపు రెక్కకి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఇది పైలట్ గమనించలేదు. పుల్వరి షరీఫ్ ప్రాంత ప్రజలు చూసి వెంటనే ఎయిర్‌పోర్ట్ అధికారులకు కాల్ చేశారు. అప్పటికే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌లు ఆన్ కావటం వల్ల పైలట్ అప్రమత్తమయ్యాడు. అప్పటికప్పుడు మళ్లీ విమానాన్ని వెనక్కి మళ్లించి ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ప్రమాద సమయంలో విమానంలో 185 మంది ప్రయాణికులున్నారు. వీరంతా సురక్షితంగా ఉన్నారని ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు. మంటలు భారీగా రాకపోవటం వల్లే ప్రమాదం తప్పిందని చెప్పారు. ఎడమవైపు ఉన్న ఇంజిన్‌లో రెండు బ్లేడ్‌లు వంగిపోయాయని, అక్కడి నుంచి మంటలు అంటుకున్నాయని తెలిపారు. పక్షి అడ్డురావటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన విమానాన్ని బోయింగ్ 727గా నిర్ధరించారు.
అంతకు ముందు స్పైస్‌జెట్ సిస్టమ్స్‌పై ర్యామ్‌సర్ వేర్ అటాక్ చేయటం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. డిపార్చర్స్ అన్నీ ఆలస్యమయ్యాయి. చెన్నై నుంచి దుర్గాపూర్ వెళ్లాల్సిన ఫ్లైట్‌కీ ఇలాంటి సమస్యే ఎదురైంది. టెక్నికల్ ఇష్యూ అని చెప్పి చెన్నైలో ల్యాండ్చే శారు. ఇలా తరచుగా ఏదో ఓ సమస్య రావటం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.