Nitish Kumar: నితీశ్ కుమార్ సంచలన హామీ- ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా!

ABP Desam   |  Murali Krishna   |  15 Sep 2022 05:27 PM (IST)

Nitish Kumar: 2024 పార్లమెంటు ఎన్నికల్లో భాజపాయేతర కూటమి గెలిస్తే అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని బిహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు.

(Image Source: PTI)

Nitish Kumar: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాయేతర కూటమి గెలిస్తే అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.

మేము (ప్రతిపక్షం) వచ్చేసారి (కేంద్రంలో) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, వెనుకబడిన రాష్ట్రాలకు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వకూడదు? మేము బీహార్ గురించి మాత్రమే మాట్లాడటం లేదు, ఇతర వెనుకబడిన రాష్ట్రాల గురించి కూడా మాట్లాడుతున్నాం. ప్రత్యేక హోదా సాధించాలి. - నితీశ్ కుమార్, బిహార్ సీఎం
 

బిజీబిజీ

గత నెలలో భాజపాతో తెగతెంపులు చేసుకున్న నితీశ్ కుమార్ మళ్లీ లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్‌జేడీతో చేరి బిహార్ ముఖ్యమంత్రి అయ్యారు. బిహార్ తర్వాత నితీశ్ కుమార్ ఇప్పుడు భాజపాను కేంద్రం నుంచి గద్దె దించాలని చూస్తున్నారు. ఇందుకోసం ఆయన సన్నాహాలు కూడా మొదలుపెట్టారు.

ఇటీవల నితీశ్.. దిల్లీలో పర్యటించి మొత్తం విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. "మేం ఏర్పాటు చేసేది థర్డ్ ఫ్రంట్ కాదు మెయిన్ ఫ్రంట్" అంటూ నితీశ్ చెబుతున్నారు. ప్రధాని పదవి రేసులో ప్రతిపక్షాల నుంచి నితీశ్ పేరే ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ ఆ వార్తలను ఆయన తోసిపుచ్చారు. అయితే జేడీయూ, దాని మిత్రపక్షాలు మాత్రం నితీశ్‌ను ప్రధాని పదవి రేసులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

కేసీఆర్‌ భేటీ

మరోవైపు నితీశ్ కుమార్, ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, తేజస్వీ యాదవ్ తదితరులను కేసీఆర్ ఇటీవలే పట్నాలో కలుసుకుని చర్చలు జరిపారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని కేసీఆర్ కోరుతున్నారు.

కేసీఆర్ ఇప్పటికే బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎంస్టాలిన్, కేరళ సీఎం విజయన్, జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామి, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌లతో కూడా సమావేశమై చర్చలు జరిపారు.  

అయితే విపక్షాల ప్రధాని అభ్యర్ధి ఎవరో ఇంకా స్పష్టం కాలేదు. ఈలోగానే ఎవరికి తోచినట్లుగా వాళ్లు కీలక ప్రకటనలు చేస్తున్నారు. నితీశ్ అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తానని ప్రకటించగా కేసీఆర్ దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఇటీవలే ప్రకటన చేశారు. 

Also Read: Queen Elizabeth II funeral: క్వీన్ ఎలిజబెత్ 2 శవపేటిక వద్ద కుప్పకూలిన గార్డ్- వైరల్ వీడియో!

Also Read: Tamil Nadu Waqf Board: ఆ ఆలయం సహా గ్రామం మొత్తం మాదే: వక్ఫ్ బోర్డు సంచలన ప్రకటన

Published at: 15 Sep 2022 05:17 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.