సికింద్రాబాద్‌ నుంచి రైళ్లు పునరుద్ధరణ..?


అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే సాయంత్రం 7 తరవాత పునరుద్ధరించనుందని సమాచారం. ఉదయం నిరసనలు తీవ్రమవటం వల్ల వెంటనే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను మార్గం మళ్లించాలని నిర్ణయించింది దక్షిణమధ్య రైల్వే. అయితే ఇప్పుడు కాస్త అల్లర్లు సద్దుమణగటం వల్ల రైళ్లను పునరుద్ధరించేందుకు సిద్ధమవుతోంది.  


సికింద్రాబాద్‌లో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలతో ఒక్కసారిగా రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. చినికి చినికి గాలివానగా మారాయి ఈ అల్లర్లు. నిరసనకారులు అంతకంతకూ ఆందోళనలు తీవ్రతరం చేయటం వల్ల పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా ఒకరు మృతి చెందారు. ఈ పరిణామాల తరవాత దాదాపు 71 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది. హౌరా-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, సిర్‌పూర్‌ కాగజ్‌నగర్-సికింద్రాబాద్, గుంటూరు-వికారాబాద్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ట్విటర్‌లో వెల్లడించింది. 


18046 హైదరాబాద్-షాలిమార్, 07078 ఉందానగర్-సికింద్రాబాద్, 07055 సికింద్రాబాద్-ఉందానగర్ రైళ్లను పూర్తిగా రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్-రేపల్లె ట్రైన్‌ని తాత్కాలికంగా రద్దు చేసింది. షిర్డీ సాయినగర్-కాకినాడ పోర్ట్, భువనేశ్వర్-ముంబయి రైళ్లను మార్గం మళ్లించనున్నారు. అటు ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లనూ రద్దు చేశారు. లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి,  ఫలక్‌నుమా-లింగంపల్లి ఎమ్‌ఎమ్‌టీఎస్‌ సర్వీస్‌లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఇప్పుడు వాటిని మళ్లీ ప్రారంభించనుంది..! 


ఉత్తర మధ్య రైల్వే సర్వీసులపైనా ప్రభావం 


అగ్నిపథ్ ఆందోళనల కారణంగా అటు ఉత్తర మధ్య రైల్వేకు సంబంధించిన పలు రైళ్ల సర్వీస్‌లూ ప్రభావితమయ్యాయి. హౌరా-న్యూదిల్లీ పూర్వా ఎక్స్‌ప్రెస్, హౌరా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్, దన్‌పూర్-టాటా ఎక్స్‌ప్రెస్, రాంచీ-పట్నా పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్, ఆసన్‌సోల్‌-టాటా ఎక్స్‌ప్రెస్, జైనగర్-హౌరా ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లపై ప్రభావం పడనుంది. 


అగ్నిపథ్‌ను రద్దు చేసి ఆర్మీ పరీక్షలు యధాతథంగా నిర్వాహించాలని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. పరిస్థితి చేయిదాటడంతో సికింద్రాబాద్‌ స్టేషన్‌లో అన్ని రైళ్లను అధికారులు నిలిపేశారు. రైల్వేస్టేషన్‌ వద్ద ఆర్టీసీ బస్సులను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆర్మీ అభ్యర్థుల ఆకస్మిక దాడితో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఏం జరగుతుందో తెలిసేలోపే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అగ్నిగుండంగా మారింది. అగ్నిపథ్‌తో ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్రం వివరణ ఇస్తున్నా, దేశవ్యాప్తంగా ఆర్మీ అభ్యర్థులు మాత్రం నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. బిహార్‌లో ఆందోళనకారులు ఎంపీ ఇంటికి నిప్పంటించటం సంచలనమైంది. అక్కడ రెండు రోజులుగా అగ్నిపథ్‌పై నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కేంద్రం మాత్రం రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నిలిపివేసేదే లేదని తేల్చి చెప్పింది.