భారతీయ జనతా పార్టీని  కలసి కట్టుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్ని బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఓ విందు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న  దిగ్గజ నేతలంతా హాజరయ్యే అవకాశం ఉంది. శరద్ పవార్, ఉద్దవ్ ధాకరే, ఎంకె స్టాలిన్, మమతా బెనర్జీ కూడా హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ  విందు భేటీ ఏర్పాట్లను కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత చేస్తున్నారు. అందర్నీ సమన్వయపరిచే బాద్యతలు కూడా ఆయనే తీసుకున్నారు. 


విపక్ష పార్టీల నేతలతో త్వరలో సోనియా విందు భేటీ..!


కాంగ్రెస్‌ కూటమితో పాటు కూటమిలో లేకపోయినా బీజేపీని వ్యతిరేకంగా అన్ని విపక్ష పార్టీల నేతలను ఈ విందు భేటీకి హాజరయ్యేలా చూడాలని నిర్ణయించుకున్నారు.  ఈ సమావేశం ఎప్పుడనే విషయంపై ఇంకా తేదీ ఖరారు చేయలేదు. కానీ త్వరలోనే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలు.. అలాగే బీజేపీకి గట్టి పోటీ ఇచ్చి ప్రత్యామ్నాయం అని ప్రజల్లో భావన కలిగేలా చేయడానికి సోనియా గాందీ ప్రయత్నిస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీలో  జీ -23 అని పేరు పడిన కొంత మంది సీనియర్ నేతలు కాంగ్రెస్  హైకమాండ్‌ను ధిక్కరిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. వీరిలో ఒకరైన కపిల్ సిబల్ మూడు రోజుల కిందట బీజేపీయేతర పార్టీల నేతలతో విందు సమావేశం నిర్వహించారు. దీనికి వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు . కానీ కపిల్ సిబల్ ఈ సమావేశం గురించి సోనియా గాంధీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. 


సొంత అసంతృప్తి నేతలకు చెక్.. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు..!


ఇప్పుడు సోనియా గాంధీ నిర్వహించే సమావేశానికి అన్ని విపక్ష పార్టీల అగ్రనేతలు హాజరు అయ్యేలా చూడటం ద్వారా ఈ అసంతృప్త జీ-23 గ్రూప్‌తోపాటు బీజేపీకి కూడా విపక్షాలన్నీ ఏకమయ్యాయన్న సందేశాన్ని పంపినట్లు అవుతుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. త్వరలో జరగనున్న విందు భేటీలోనే రాబోయే  సాధారణ ఎన్నికల్లో బీజేపీని కలసి కట్టుగా ఎదుర్కొనే కూటమికి  సోనియా గాంధీ ప్రణాళికలు వివరించే అవకాశం ఉంది. ఇప్పటికే రాహుల్ గాందీ విపక్ష పార్టీలతో  ఓ సారి సమావేశం అయ్యారు. ఆ సమావేశానికి కూడా బీజేపీయేతర విపక్ష రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. అరవింద్ కేజ్రీవాల్ ఆప్ మాత్రం దూరంగా ఉంది. సోనియా గాంధీతో జరగనున్న విందుభేటీకి ఆప్‌ కూడా హాజరయ్యేలా చూడాలని అనుకుంటున్నారు. 


బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం..!


ప్రధానమంత్రి నరేంద్రమోడీ కి ప్రత్యామ్నాయం అని భావించే నాయకత్వం ఇతర పార్టీలకు లేకపోవడంతో పాటు విపక్ష పార్టీలన్నీ ఎవరికి వారుగా పోరాడుతూండటంతో బీజేపీకి ప్రతీ సారి కలసి వస్తోంది. ఈ సారి ఎన్నికల్లో మాత్రం అలాంటి పరిస్థితి రానీయకూడదని కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. బీజేపీ  మరోసారి అధికారంలోకి వస్తే ప్రాంతీయ పార్టీలన్నింటికీ ముప్పేనని ఆయా  పార్టీల నేతలు భావిస్తున్నారు. అందుకే వారుకూడా... బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. మమతా బెనర్జీ, స్టాలిన్, శరద్ పవార్ లాంటి వారు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నదానిపై పట్టుదలకు పోవాలని అనుకోవడం లేదు. రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థి అయితే  ప్రశాంత్ కిషోర్ .. కూటమి పార్టీల విజయానికి వ్యూహాలు రచించే అవకాశం ఉంది. అందుకే... ఇతర పార్టీలు కూడా ఈ విషయంలో ఆసక్తిగానే ఉన్నాయన్న ప్రచారం ఢిల్లీలో సాగుతోంది.