Congress Working Committee : కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి సిడబ్ల్యూసీలో మరో నలుగురికి చోటు కల్పిస్తూ సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. కుమారి సెల్జా, అభిషేక్ మను సింఘ్వీ, టీ సుబ్బారామి రెడ్డి, అజయ్ కుమార్ లల్లూ ఉన్నారు. సీడబ్ల్యూసీలో సభ్యులుగా కుమారి సెల్జా, అభిషేక్ మను సింఘ్వీలను, శాశ్వత ఆహ్వానితునిగా టి సుబ్బిరామి రెడ్డిని, ప్రత్యేక ఆహ్వానితునిగా అజయ్ కుమార్ లల్లూ సోనియా గాంధీ నియమించారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
కేంద్ర మాజీ మంత్రిగా సేవలందించిన డాక్టర్ టీ సుబ్బరామిరెడ్డి.. పలు స్టాండింగ్ కమిటీలకు చైర్మన్‌గా, టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ పరంగా కూడా వివిధ కీలక పదవుల్లో కొనసాగారు. ప్రస్తుతం సుబ్బిరామిరెడ్డి రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా లేరు. అయితే దక్షిణాది నుంచి అత్యంత సీనియర్‌కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో సుబ్బిరామిరెడ్డికి చాన్సిచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీ పట్ల విధేయతతో సుబ్బిరామిరెడ్డి ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా..లేకపోయినా...ఆయన కుటుంబ వ్యాపారాల విషయంలో ఇబ్బందులు ఎదురైనా ఇతర పార్టీల వైపు చూడలేదన్న అభిప్రాయం కాంగ్రెస్ హైకమాండ్‌కు ఉన్నట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోనే కాంగ్రెస్ పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాలు.. ఇతర నిర్ణయాలు తీసుకుంటారు. పార్టీ నడిపేది వర్కింగ్ కమిటీనే. వర్కింగ్ కమిటీలో స్థానాన్ని అత్యున్నత పదవిగా కాంగ్రెస్‌లో భావిస్తున్నారు. అలాంటి పదవి సుబ్బిరామిరెడ్డికి లభించడంతో ఆయన అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.