Costs in Bengaluru : బెంగళూరులో బతకాలంటే కుబేరుడు అయి ఉండాలని సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు సెటైర్లు వేస్తున్నారు. అక్కడ యాభై లక్షలు సంపాదించినా బయట పాతిక లక్షలు సంపాదించినా ఒకటే అంటున్నారు. దీన్ని విశ్లేషిస్తూ ఓ టెకీ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
  


బెంగళూరులో 50 లక్షల ప్యాకేజీ (LPA) ఇప్పుడు 25 లక్షల ప్యాకేజీ స్థాయికి సమానమని ఆ టెకీ చెబుతున్నారు.  బెంగళూరులో జీవన వ్యయం,  ఆర్థిక పరిస్థితుల కారణంగా దీనిని సాధారణ జీతంగా పరిగణించవచ్చని పేర్కొన్నారు. ఈ పోస్ట్ పై టెక్ ఉద్యోగులు భిన్నంగా స్పందిస్తున్నారు. 


బెంగళూరులో అధిక జీవన వ్యయం, ఇంటి అద్దెలు,  ద్రవ్యోల్బణం, టెక్ రంగంలో పోటీ కారణంగా 50 LPA సాధారణ జీతంగా మారిందని కొందరు వాదించారు.  మరికొందరు ఈ స్థాయి జీతం ఇప్పటికీ టాప్-టైర్ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉందని, సామాన్య టెక్ ఉద్యోగులకు ఇది అసాధ్యమని కొంత మంది గుర్తు చేశారు.  



కొందరు యూజర్లు 50 LPAని సమర్థించారు, బెంగళూరులో 2 BHK ఫ్లాట్ అద్దె రూ. 40,000-60,000, అధిక జీవన వ్యయం,  పన్నుల కారణంగా 50 LPA సరిపోదని వాదించారు.  భారతదేశంలో సగటు జీతం రూ. 4-8 LPA ఉంటుందని, 50 LPAని సాధారణమనడం అతిశయోక్తి అని  కొందరు విమర్శించారు.  50 LPA సీనియర్ డెవలపర్లు లేదా టెక్ లీడ్‌లకు సాధ్యమని, కానీ ఫ్రెషర్లు లేదా మధ్యస్థ స్థాయి ఉద్యోగులకు ఇది అసాధారణమని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తంచేశారు.



బెంగళూరు భారతదేశ టెక్ హబ్‌గా, Google, Amazon, Microsoft వంటి గ్లోబల్ కంపెనీలతో పాటు స్టార్టప్‌లకు కేంద్రంగా ఉంది. సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు 50 LPA లేదా అంతకంటే ఎక్కువ జీతాలు సాధారణం, కానీ ఫ్రెషర్లకు సగటు జీతం 8-15 LPA మధ్య ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. బెంగళూరులో జీవన వ్యయంపై తరచూ ఇలాంటి పోస్టులు వైరల్ అవుతూనే ఉంటాయి.