Skulls Bones Found During Pit Cleaning:  దృశ్యం సినిమాలలో ఎవరైనా అక్కడ పాతి పెట్టారా.. లేకపోతే అక్కడ అంతకు ముందు ఏమైనా స్శనాశనం ఉండేదా..  లేకపోతే  ఏదైనా తెలియని ఘోరం జరిగిందా అని బెంగళూరులోని అపార్టు మెంట్ వాసులు వణికిపోతున్నారు. ఎందుకంటే.. వర్షాకాలం వచ్చింది.. ఓ ఇంకుడు గుంతలోకి నీళ్లు సరిగా ఇంకడం లేదని రిపేర్ చేయించాలనుకున్నారు. తవ్వించారు. కానీ అక్కడ అస్తిపంజరాలు బయటపడ్డాయి. 

బెంగళూరులోని MN క్రెడెన్స్ ఫ్లోరా అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఈ  షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కారు పార్కింగ్ సమీపంలోని పెర్కొలేషన్ పిట్‌ను శుభ్రం చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అస్థిపంజర అవశేషాలు, పుర్రె శకలాలను కనుగొన్నారు. వారు వెంటనే రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (RWA) అధ్యక్షుడికి సమాచారం అందించారు. ఎందుకైనా మంచిదని ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

ఈ అవశేషాలు మానవులవా, జంతువులవా అనేది ఇంకా తెలియలేదు. బేగూర్ పోలీస్ స్టేషన్ అధికారి   ఈ ఎముకలను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి విశ్లేషణ కోసం పంపించారు.  ఫలితాలు ఒక వారంలో రానున్నాయి. ఈ భూమి గతంలో స్మశాన భూమిగా ఉండేదని కొందరు స్థానికులు  చెబుతున్నారు. కానీ అక్కడ పదేళ్ల కిందట అపార్టుమెంట్ నిర్మించారు. పునాదుల కోసం భారీగా తవ్వారు. అప్పుడు బయటపడని ఈ ఎముకలు, పుర్రెలు ఇప్పుడు ఎందుకు బయటపడ్డాయని చాలా మందికి అనుమానం. ఫోరెన్సిక్ నివేదిక రాకముందు ఎలాంటి నిర్ధారణకు రాలేమని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. 

సివిక్ అథారిటీల నుండి బహుళ నోటీసులు రావడంతో ఈ ఏరియా మొత్తాన్ని శుభ్రం చేశారు.   దాదాపు 45 ఫ్లాట్లు, 10 ఏళ్ల నివాస చరిత్ర కలిగిన ఈ కాంప్లెక్స్‌లో స్టార్మ్‌వాటర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ సరిగా పనిచేయడం లేదు. మొత్తం 16 పెర్కొలేషన్ పిట్‌లలో ఒక్కటిలోనే ఈ అవశేషాలు లభించాయి బేగూర్ పోలీసులు భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS), 2023, సెక్షన్ 194(3)(iv) కింద దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటన నివాసితుల్లో భయం, అసౌకర్యం కలిగించింది, స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దృశ్యం సినిమా తరహాలో ఎవరైనా హత్య చేసి పాతి పెట్టారా అని భయపడుతున్నారు.