ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ (కేకే) కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. 53 సంవత్సరాల వయసున్న కేకే కోల్‌కతాలో ఒక కాన్సర్ట్‌లో ప్రదర్శన ఇస్తూ హఠాత్తుగా కుప్పకూలారు. వెంటనే ఆయన్ను ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.


కోల్‌కతాలోని నజ్రుల్ మంచాలో ప్రదర్శన ఇస్తున్నట్లు ఆయన మే 31వ తేదీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే కాన్సర్ట్ మధ్యలోనే ఆయన పడిపోవడంతో కోల్‌కతాలోని సీఎంఆర్ఐ ఆస్పత్రికి రాత్రి 10 గంటల సమయంలో ఆయన్ను తీసుకువెళ్లారు. అయితే కేకే అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు కూడా తెలిపాయి.



భారతీయ సినీ పరిశ్రమలో వెర్సటైల్ సింగర్స్‌లో కేకే ఒకరు. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌ను ఆయన ఆలపించారు. ఆయన మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఆయన కేకేకు నివాళులు అందించారు.


ప్రధాన మంత్రి మోదీతో పాటుప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, సింగర్లు రాహుల్ వైద్య, అర్మాన్ మలిక్, హర్ష్‌దీప్ కౌర్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌లు సోషల్ మీడియా వేదికగా తమ నివాళులను తెలియజేశారు.