Shraddha Murder Case:


తక్షణమే స్పందించి ఉంటే..


శ్రద్ధ హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిందితుడు అఫ్తాబ్‌ను పోలీసులు విచారి స్తున్నారు. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. వేరే డేటింగ్ పార్ట్‌నర్‌ను కలిసినందుకే...శ్రద్ధను హత్య చేశానని చెప్పాడు అఫ్తాబ్. ఈ క్రమంలోనే...శ్రద్ధ తండ్రి వికాస్ వల్కర్ స్పందించారు. పోలీసులు సహకరించి ఉంటే...తన కూతురు సురక్షితంగా ఇంటికి తిరిగొచ్చేదని
అన్నారు. వాసై పోలీసులు తక్షణమే స్పందించి ఉంటే...ఈ పరిస్థితి వచ్చేది కాదని అసహనం వ్యక్తం చేశారు. "నా కూతురుని అత్యంత దారుణంగా హత్యచేశారు. వాసై పోలీసుల కారణంగా నేనెన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. వాళ్లు కాస్తైనా సహకరించి ఉంటే నా కూతురు ప్రాణాలతో ఉండేది" అని అన్నారు. ముంబయిలో నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు వికాస్ వల్కర్. అయితే...ప్రస్తుతం ఢిల్లీ, వాసై పోలీసులు జరుపుతున్న విచారణ బాగానే కొనసాగుతోందని అన్న ఆయన...కొందరు పోలీసులు కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారని ఆరోపించారు. విచారణలో జాప్యం చేస్తున్నారని విమర్శించారు. అఫ్తాబ్‌తో శ్రద్ధ సన్నిహితంగా ఉండడం తనకు నచ్చేది కాదని స్పష్టం చేశారు. "అఫ్తాబ్ చేతిలో అంత హింసకు గురవుతోందన్న విషయం నాకు తెలియదు" అని చెప్పారు. శ్రద్ధను అంత దారుణంగా హింసిస్తున్న విషయం అఫ్తాబ్ కుటుంబ సభ్యులకు తెలిసే ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. "నేను చివరిసారి శ్రద్ధతో 2021లో మాట్లాడాను. క్షేమసమాచారాలు అడిగాను. బెంగళూరులో ఉన్నానని చెప్పింది. ఈ మధ్యే సెప్టెంబర్ 26న అఫ్తాబ్‌తో నేను మాట్లాడాను. 
నా కూతురి గురించి అప్పుడే అడిగాను. కానీ...నా ప్రశ్నలకు అతను సమాధానం చెప్పలేదు" అని వెల్లడించారు వికాస్ వల్కర్. రెండేళ్లుగా తన కూతురితో మాట్లాడాలని ప్రయత్నించినప్పటికీ...ఎప్పుడూ శ్రద్ధ సరిగా స్పందించలేదని  చెప్పారు. 










అలాంటి శిక్షే పడాలి: వికాస్ 


"నా కూతురు ఎంత దారుణంగా అయితే చంపాడో అంతే దారుణమైన శిక్ష అఫ్తాబ్‌కు విధించాలి. అఫ్తాబ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులనూ విచారించాలి" అని డిమాండ్ చేశారు. ఢిల్లీ పోలీసులు సరైన న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సరైన న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. వికాస్ వల్కర్ తరపు న్యాయవాది సీమా కుశ్వాహా కీలక వ్యాఖ్యలు చేశారు. డేటింగ్ యాప్స్‌పై నిఘా పెంచాలని  అన్నారు. "డేటింగ్ యాప్స్‌ వినియోగించే హక్కు అందరికీ ఉండొచ్చు. కానీ...వీటిపై నిఘా అవసరం. క్రిమినల్స్, ఉగ్రవాదులు ఎందరో ఆ యాప్స్‌ని దుర్వినియోగం చేసే ప్రమాదముంది. అఫ్తాబ్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా చార్చ్‌షీట్‌లో చేర్చాల్సిన అవసరముంది" అని అన్నారు. 


Also Read: Himachal Congress Meet: హిమాచల్ సీఎం పీఠంపై ఇంకా వీడని చిక్కుముడి, షిమ్లాలో ఎమ్మెల్యేల మీటింగ్