Shocking news for those who want to go to Saudi for employment: భారత్‌ కు చెందిన స్కిల్డ్ ఉద్యోగులు అమెరికా,ఆస్ట్రేలియా వంటి దేశాల వైపు చూస్తూంటారు. అవకాశం దొరికితే ఎగిరిపోవాలనుకుంటారు. అలాగే అన్ స్కిల్డ్ లేబర్ ఎక్కువగా ఉపాధి కోసం గల్ఫ్ దేశాల వైపు చూస్తూంటారు. ఇళ్లల్లో పనులు చేయడం దగ్గర నుంచి ఒంటెలు కాయడం వరకూ అనేక పనులు చేయడానికి  మన దేశం నుంచి గల్ఫ్ కు వెళ్తూంటారు. అయితే ఇప్పుడు అక్కడ కాస్త మంచి ఉద్యోగాలు చేయడానికి కూడా వెళ్తున్నారు. మ్యాన్ పవర్ అక్కడి దేశాలకు అవసరం. ఆ దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర కీలకం. అయితే ఇప్పుడు అలా ఉపాధి కోసం వస్తున్న వారికి కొన్ని షరతులు పెట్టాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించుకుంది.               

వృత్తి, విద్యా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తప్పనిసరి !       

ఇక సౌదీ వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు తప్పనిసరిగా విద్య, వృత్తి అర్హతలను సంబంధించి ముందస్తు వెరీపికేషన్ పూర్తి చేయించుకోవాల్సి ఉంటుంది. ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి సౌదీకి వస్తున్న వారి సంఖ్య అంతంతకూ పెరుగుతోందని దీన్ని అడ్డుకట్ట వేయడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా సౌదీ ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి కూడా. సౌదీలోని భారత దౌత్య కార్యాలయం ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది. వర్క్ వీసా జారీకి తప్పని సరిగా చేయాల్సిన పనుల్లో.. ప్రొఫెషనల్ వెరీఫికేషన్‌ను కూడా చేర్చారని తెలిపింది.          

భారత్ నుంచి వచ్చే వారిని నియంత్రించడానికేనా ?               

ఈ అంశంపై సౌదీ ఆరు నెలలుగా కసరత్తు చేస్తోంది. సౌదీ ప్రభుత్వం ఈ రూల్ తీసుకు రావడానికి కారణాలు ఏమి చెబుతున్నప్పటికీ.. అసలు కారణం మాత్రం భారత్ నుంచి ఉపాధి కోసం వచ్చేవారిని నియంత్రించడం అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త విధానం ప్రకారం.. వర్క్ వీసాలతో దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్లను తామే జారీ చేశామని ఆయా సంస్థలు వెరిఫై చేయాల్సి ఉంటుంది.             

సౌదీలో 24  లక్షల మంది భారతీయులకు ఉపాధి       

సౌదీ అరేబియాలో అత్యధికంగా ఉపాధి పొందుతున్న విదేశీయుల్లో భారతీయలు రెండో స్థానంలో ఉన్నారు. ఇరవై నాలుగు లక్షల మందికిపైగా భారతీయులు సౌదీలో ఉపాధి పొందుతున్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఎనిమిది లక్షల మంది ఇళ్లల్లో పని చేస్తున్నారు. భారత్ కంటే ముందు బంగ్లాదేశ్ పౌరులు సౌదీలో ఎక్కువగా ఉన్నారు. బంగ్లాదేశీయులు ఇరవై ఏడు లక్షల మంది సౌదీలో ఉపాధి పొందుతున్నారు.            

Also Read:  కొత్త బంగారు గని పాక్ కష్టాలను గట్టెక్కిస్తుందా? - లేక ఆఫ్రికా పరిస్థితే దీనికి కూడా వస్తుందా!