Sankranti son in laws Special | గోదావరి జిల్లాలు అంటే మర్యాదలకు పెట్టింది పేరు. అందులోనూ సంక్రాంతి అల్లుడికి  వారు చేసే మర్యాదల గురించి తెలుగు రాష్ట్రాల్లో గొప్పగా చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు ఆ సంప్రదాయం శృతి మించుతున్న ఆనవాళ్లు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ " అతి " మర్యాదల  ట్రెండ్ తెలంగాణకు సైతం పాకుతున్నాయి 


తెలంగాణ అల్లుడికి గోదారి మర్యాదలు 
తెలంగాణ అమ్మాయిని చేసుకున్న  కాకినాడ అబ్బాయి  పండక్కి హైదరాబాద్ వచ్చాడని అత్తింటి వారు 130 రకాల వంటకాలతో భోజనాలు వడ్డించిన  వైనం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా ఇలాంటి సంఘటనలు గోదావరి జిల్లాల్లో చూస్తాం. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ తెలంగాణ కూడా పాకింది. సంగారెడ్డి లోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. రానున్న రోజుల్లో ఇది  మరింత గా పెరిగే ఛాన్స్ లేకపోలేదు.


465 రకాలతో కొత్త అల్లుడికి భోజనాలు


 యానాం కు చెందిన ఒక వ్యాపారి తన అల్లుడికి  465 రకాల వంటకాలతో భోజనాలు వడ్డించిన సంఘటన కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్ని టీవీ ఛానళ్లు, పేపర్లు దీని గురించి రాశాయి.దీన్ని చూసి ఆ కోవలో మరి కొంతమంది రెడీ అవుతున్నారు.


మర్యాద చేయడం తప్పా... అంటే 


 అయితే అల్లుడికి ఇలాంటి మర్యాదలు చేయడం తప్పా అంటే కొంచెం లోతుగా మాట్లాడుకుంటే కొన్ని విషయాలు తెలిసే ఛాన్స్ ఉంది. నిజానికి ఈ ట్రెండ్ ఒక అయిదారేళ్ళ క్రితం మొదలైంది. సోషల్ మీడియా, యూ ట్యూబ్ ఛానెళ్లు ఊపు అందుకుంటున్న టైంలో  యానాం, ధవళేశ్వరం ప్రాంతాల్లో కొత్తఅల్లుడి కి జరిగిన మర్యాదలపై ఎక్కువ ప్రచారం జరిగింది. అక్కడి నుంచి మొదలై ప్రతి ఏడూ ఇది ఒక ట్రెండ్ లా మారింది. ఒకళ్ళని చూసి మరొకళ్ళు  వందల వెరైటీలతో అల్లుడికి భోజనాలు వడ్డించడం, ఊరేగింపులు జరిపించడం  ఆనవాయితీ అయిపోయింది. దీనివల్ల మార్కెట్లోకి డబ్బు పంపిణీ జరుగడం అనేది ఒక పాజిటివ్ అంశం కావచ్చు.


పిండివంటల రూపంలో, స్వీట్ షాపులకు, మేళ తాళాలకు డబ్బు డైరెక్ట్ గా పంపిణీ  అవ్వడం వాళ్లకు ఉపయోగపడుతోంది. కానీ ఈ మర్యాదలు చేస్తున్న వారి ఆర్థిక స్థితి ఏంటి అనేది కూడా ముఖ్యం. సంపన్న అత్తమామలు  చేసే ఈ అతి మర్యాదల ట్రెండ్ ఇప్పుడు ఎగువ  మధ్య తరగతి, మధ్యతరగతి  వర్గాలకు కూడా పాకుతోంది. దీనికోసం అప్పులు చేసి మరి  అల్లుడి మర్యాదల కోసం, సొసైటీలో ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం ఖర్చు పెడుతున్న వాళ్ళు ఎక్కువవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతాం, ఊళ్ళో గొప్పగా చెప్పుకుంటారనే  భ్రమలో  అప్పుల పాలు అవుతున్న అత్త మామలు లేకపోలేదు. ఇప్పుడు నెమ్మదిగా తెలంగాణకు  కూడా ఈ వైఖరి వెళ్ళిపోయింది. రానున్న రోజుల్లో అక్కడ మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని  పరిస్థితులు గమనిస్తున్న వాళ్ళు అంటున్నారు. అల్లుడు మంచోడు అయితే సరే.. లేకుంటే అతని గొంతెమ్మ కోరికలకు ఇబ్బందులు పడే మధ్యతరగతి అత్తా మామల కథలు చాలానే విన్నాం.


ప్రస్తుతానికి సరదాగే ఉన్న ఈ "అతి  " మర్యాదల ట్రెండ్ పై మిడిల్ క్లాస్  సరైన దృష్టి పెట్టకపోతే ఇదొక బ్యాడ్ ట్రెడిషనల్ గా మారిపోయే ప్రమాదం లేకపోలేదు. అల్లుడి తో సరదాగా గడిపామా లేదా, అమ్మాయి అల్లుడు ఎంత సంతోషంగా ఉన్నారు  అనే దానిపై పెట్టాల్సిన దృష్టి  ఈ "అతి " మర్యాదలపై పెట్టడం అంత సరికాదనే  మాటలు కూడా వినిపిస్తున్నాయి ఈమధ్య. కాబట్టి మిడిల్ క్లాస్ "అత్తామామలూ ".. జరభద్రం.