లోక్‌సభ చీఫ్‌ విప్‌ను మార్చేందుకు ఠాక్రే ప్లాన్..


శివసేన నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోయాక, ఇప్పుడు అందరూ ఎంపీలపైనే దృష్టి సారించారు. వాళ్లు కూడా ముఖ్యమంత్రి శిందే శిబిరంలోకి వెళ్లిపోతారన్న ఊహాగానాలతో మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అప్రమత్తమయ్యారు. ఈసారి తన యుద్ధాన్ని లోక్‌సభపై మళ్లించారు. శివసేన ఎంపీలు కూడా వెన్నుపోటు పొడిచే అవకాశముందన్న నేపథ్యంలో లోక్‌సభ చీఫ్ విప్‌ను మార్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాజన్‌ విచారేను కొత్త చీఫ్ విప్‌గా నియమించాలని నిర్ణయించారు ఠాక్రే. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఈ మేరకు లేఖ రాశారు. ఆయన అనుమతిని కోరారు. ఆయన అంగీకరిస్తే శివసేన లోక్‌సభ చీఫ్‌ విప్‌గా రాజన్ విచారే బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతాని భవాని గిల్‌ ఈ పదవిలో ఉన్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఆయన స్థానంలోకి రాజన్ వస్తారు. ఇదే విషయాన్ని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ వెల్లడించారు. "మా పార్టీకి సంబంధించి లోక్‌సభలో కొన్ని మార్పులు చేర్పులు చేశాం. రాజన్ విచారేను లోక్‌సభ చీఫ్ విప్‌గా నియమించాలని ఓం బిర్లాకు ఉద్దవ్ ఠాక్రే లేఖ రాశారు" అని స్ఫష్టం చేశారు. 


ఎంపీలు కూడా వెళ్లిపోతారా..? 


ఇప్పటికే శివసేన నుంచి దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు శిందే వైపు వెళ్లిపోయారు. ఫలితంగా మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్ప కూలిపోయింది. తరవాత రాజకీయ పరిణామాలు మారిపోయి, శిందే అధికారం చేపట్టారు. అయితే దాదాపు 18 మంది శివసేన ఎంపీల్లో కొందరు ఏక్‌నాథ్ శిందే వైపు వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఓ శివసేన ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూర్చు తున్నాయి. ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి మద్దతు ఇవ్వాలని ఉద్దవ్ ఠాక్రేకు వినతి పంపారు ఆ ఎంపీ. ఇది కాస్తా పెద్ద చర్చకే దారి తీసింది. అంతే కాదు. ఏ రెబల్ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ కూడా శిందే తదుపరి లక్ష్యం ఏమిటో చెప్పకనే చెబుతున్నాయి. 
శివసేనకు చెందిన 18 మంది ఎంపీల్లో కనీసం 12 మంది సీఎం శిందే వైపు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని, రెబల్ ఎమ్మెల్యే గులాబ్‌రావ్
పాటిల్ అన్నారు. నలుగురు ఎంపీలను నేరుగా కలిసి ఈ విషయమై చర్చించాననీ చెప్పారు. 22 మంది మాజీ ఎమ్మెల్యేలూ కూడా తమతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. నిజానికి 2019లో ఎన్నికల బరిలోకి దిగినప్పుడు శివసేన-భాజపా కూటమిగా ఉంది. అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వేవ్ కారణంగా 48 సీట్లలో 18 స్థానాలు గెలుచుకుంది ఈ కూటమి. ఈ సారి భాజపాతో వైరం పెరగటం వల్ల ఆ కొన్ని స్థానాలు కూడా శివసేనకు రావటం కష్టమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అటు ఎంపీలు కూడా అభద్రతా భావంతో ఉన్నారని తెలుస్తోంది.