Sanjay Shirsat video :మహారాష్ట్రలోని శివసేన (షిండే వర్గం) నాయకుడు, సామాజిక న్యాయ శాఖ మంత్రి సంజయ్ షిర్సాట్‌కు సంబంధించిన ఒక వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో షిర్సాట్ తన గదిలో ఒక బ్యాగ్ పక్కన కూర్చుని ఉండగా, ఆ బ్యాగ్‌లో నగదు కట్టలు కనిపిస్తున్నాయి.  షిర్సాట్ ,  అతని కుమారుడు సిద్ధాంత్ షిర్సాట్‌లు చత్రపతి సంభాజీనగర్‌లోని విట్స్ హోటల్‌ను మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఆరోపణలపై కూడా విచారణ జరుగుతోంది. హోటల్ మార్కెట్ విలువ రూ. 120 కోట్ల ఉంటే  రూ. 65 కోట్లకు కొనుగోలు చేశారు.  ఈ ఘటనలు మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చను రేకెత్తించాయి.   సంజయ్ షిర్సాట్ వీడియో  నిజమేనని అంగీకరించారు.  కానీ ఇది ఒక "కుట్ర" అని పేర్కొన్నారు. పర్యటన నుంచి తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఎవరో ఈ వీడియో తీశారు. బ్యాగ్‌లో ఏముందో తనకు తెలియదని మంత్రి చెబుతున్నారు.  ఈ వీడియోను రాజకీయంగా ప్రేరేపితమైనదని ఆరోపిస్తున్నారు.  శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ ఈ వీడియోను షేర్ చేశారు.  ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై విమర్శలు చేశారు. 

చత్రపతి సంభాజీనగర్‌లోని విట్స్ హోటల్‌ను సంజయ్ షిర్సాట్ కుమారుడు సిద్ధాంత్ షిర్సాట్ యాజమాన్యంలోని "ఎం/ఎస్ సిద్ధాంత్ మెటీరియల్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ సప్లై" కంపెనీ రూ. 65 కోట్లకు టెండర్ ద్వారా గెలుచుకుంది. అయితే, ఈ హోటల్ మార్కెట్ విలువ రూ. 120 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు ఉంటుందని విపక్ష నాయకుడు అంబదాస్ దాన్వే ఆరోపించారు.  ఈ టెండర్ ప్రక్రియలో అవినీతి మరియు కార్టెలైజేషన్ జరిగిందని ఆరోపించారు. సిద్ధాంత్ కంపెనీ 2024లో ఏర్పాటైంది.  టెండర్‌కు అర్హత కోసం అవసరమైన మూడు సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్న్‌లు లేవని ఆయన పేర్కొన్నారు .

 హోటల్ విలువ 2018లో రూ. 75.92 కోట్లుగా నిర్ణయించారు.  2025లో దాని విలువ రూ. 150 కోట్లుగా ఉందని, అయినప్పటికీ 2018 రేట్ల ఆధారంగా టెండర్ జరిగిందని దాన్వే విమర్శించారు   సిద్ధాంత్ షిర్సాట్ కు ఆర్థిక సామర్థ్యం లేదని అంటున్నారు.  షిర్సాట్ 2024 ఎన్నికల అఫిడవిట్‌లో తన కుమారుడు ఎలాంటి ఆస్తులు కలిగి లేడని పేర్కొన్నారు.  సంజయ్ షిర్సాట్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు, టెండర్ ప్రక్రియ కోర్టు ఆదేశాల మేరకు జరిగిందని, ఆరు సార్లు టెండర్ విఫలమైన తర్వాత సిద్ధాంత్ కంపెనీ పాల్గొందని చెప్పారు.  మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జూలై 7, 2025న ఈ టెండర్ ప్రక్రియలో అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. టెండర్ రద్దు చేశారు. 

సంజయ్ షిర్సాట్ 2019 ఎన్నికలలో రూ. 3.3 కోట్ల ఆస్తులను ప్రకటించగా, 2024 ఎన్నికలలో ఇది రూ. 35 కోట్లకు పెరిగింది, దీనిలో రూ. 44.8 లక్షల నగదు, రూ. 26.5 కోట్ల బ్యాంక్ రుణాలు ఉన్నాయి. ఈ ఆస్తులలో రూ. 4.4 కోట్ల విలువైన వ్యవసాయ భూమి, ముంబై,  సంభాజీనగర్‌లో రూ. 4.7 కోట్ల విలువైన ఫ్లాట్‌లు ఉన్నాయి. ఈ ఆస్తుల పెరుగుదలపై వివరణ కోసం ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ జూలై 2025లో నోటీసు జారీ చేసింది.  సంజయ్ "డబ్బు సంపాదించడం సులభం, కానీ ఖర్చు చేయడం కష్టం" అని ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు, ఇది వైరల్ అయింది.  షిర్సాట్ మొదట డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు ష్రీకాంత్ షిండేకు కూడా ఇన్‌కమ్ టాక్స్ నోటీసు వచ్చినట్లు చెప్పారు, కానీ తర్వాత ఈ వ్యాఖ్యను ఉపసంహరించుకున్నారు.