Shirt with pen stains in the pocket is being sold for Rs 75000: ఆన్ లైన్ కాలంలో అన్నీ ఫ్యాషన్లే అయిపోయాయి. 30 ఏళ్ల కిందట తెలుగులో వచ్చిన ఆ ఒక్కటి అడక్కు అనే రాజేంద్రప్రసాద్ సినిమాలో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ అనే రకాల ఫ్యాషన్లను పరిచయం చేస్తారు. ఓ గార్మెంట్ కంపెనీలో సేల్ కాకుండా ఉండిపోయిన దుస్తులను చింపి, పీలికలు చేసి.. సిగరెట్ బొక్కలు పెట్టి.. కిళ్లీలు ఊసి ఇలా రకరకాలుగా ఫ్యాషన్లుగా మార్చేస్తారు. అప్పట్లో ఇది పిచ్చ కామెడీ. అందరూ పగలబడి నవ్వుకున్నారు. సినిమా సూపర్ హిట్ అయింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఫ్యాషన్లు నిజంగానే వస్తున్నాయి. 

ఇప్పటికే అడ్డంగా చిరిగిపోయిన ఫ్యాంట్లను వేసుకుని తిరుగుతున్నారు. టార్‌డ్ జీన్స్ అని పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు అంతకు మించిన చిత్ర విచిత్రాలను అమ్మకానికి పెడుతున్నారు. స్కూళ్లకు వెళ్లినప్పుడు విద్యార్థులు పెన్నులు జేబులో పెట్టుకుంటే.. కక్కుతూ ఉంటాయి. రీఫిల్ కక్కినప్పుడు షర్ట్ జేబు అంతా ఇంక్ మరకలతో నిండిపోతుంది. అలాంటి షర్టు వేసుకోవడానికి మనం ఇష్టపడేవాళ్లం కాదు. కానీ ఇప్పుడు అలా ఇంక్ కక్కిన షర్టును ఆన్ లైన్లో 75వేల రూపాయలకు అమ్ముతున్నారు. ఎక్కడో విదేశాల్లో కాదు. మన దగ్గరే. అది కూడా లగ్జరీ బ్రాండ్ పేరుతో.    

ఈ  ఆన్ లైన్ షర్టును గుర్తించిన నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేసి.. కాలం ఇలా మారిపోయిందని ఆశ్చర్యపోతున్నారు.  

 కొంత మంది మా ఇంట్లో అలాంటివి ఉన్నాయని డిస్కౌంట్లో అమ్ముతామంటూ ఆన్ లైన్ సంస్థకు ట్యాగ్ చేసి అడుగుతున్నారు.  

ఆ షర్టులు తయారు చేసే సంస్థలో స్టైలిస్ట్ ఎవరో.. రాజేంద్ర ప్రసాద్ సినిమా చూసి ఉంటారని.. అందుకే ఇలాంటి ఐడియా వచ్చి ఉంటుందని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు.