చిన్న వయసులోనే ప్రధానిగా...ఇదో రికార్డ్..
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు జరగటం,ఆయన మృతి చెందటం ఆ దేశమంతటా సంచలనమైంది. సుదీర్ఘ కాలం పాటు జపాన్ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన అబే..1954లో సెప్టెంబర్ 21న జన్మించారు. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయనకు మొదటి నుంచి పాలిటిక్స్‌పై ఆసక్తి ఉండేది. 1993 ఎన్నికల్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎంపికయ్యారు. 2005లో చీఫ్ క్యాబినెట్ సెక్రటరీగానూ పని చేశారు. 2006లోనే ఆయన దశ తిరిగింది. అప్పటి వరకూ ప్రధానిగా ఉన్న జునిచిరో స్థానంలో..షింజో అబే ప్రధానిగా ఎంపికయ్యారు. అదే సమయంలో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ-LDPఅధ్యక్షుడిగానూ బాధ్యతలు చేపట్టారు. 2006-07 మధ్య కాలంలో ప్రధానిగా ఉన్న ఆయన, 2007లో ఉన్నట్టుండి పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో పదవిలో కొనసాగలేనని అప్పట్లో ప్రకటించారు అబే. రెండో ప్రపంచ యుద్ధం తరవాత జపాన్‌లో అత్యంత తక్కువ వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేతగా రికార్డు సృష్టించారు షింజో అబే.
అనారోగ్య కారణాలతో పదవికి రాజీనామా
షింజో అబే..ఇక రాజకీయాలకు దూరంగానే ఉంటారని అనుకున్నారు. కానీ ఆయన రీఎంట్రీ ఇచ్చారు. 2012లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది ఎల్‌డీపీకి అధ్యక్షుడిగా కొనసాగటంతో పాటు, ప్రధానిగానూ బాధ్యతలు తీసుకున్నారు. జపాన్‌లో అప్పటి వరకూ ఓ సారి పీఎం సీట్‌లో కూర్చున్నవాళ్లు మరోసారి గెలుపొందింది లేదు. కానీ, ఆ రికార్డుని కూడా తిరగరాశారు షింజో అబే. రెండోసారి ప్రధాని అయ్యారు. తరవాత 2014, 2017లోనూ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. సుదీర్ఘకాలం పాటు ప్రధానిగా ఉన్న నేతగానూ రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే మరోసారి అనారోగ్యానికి గురవటం వల్ల 2020లో రాజీనామా చేశారు. ఆయన స్థానంలో యొషిహిదే సుగా పీఎం అయ్యారు.
ఆరోపణలు అధిగమించి..అభివృద్ధి వైపు..
ఈ పదవీ కాలంలో పలు ఆరోపణలూ ఎదుర్కొన్నారు షింజో అబే. అధికారాన్ని దుర్వినియోగం చేశారని, స్కామ్‌లకు పాల్పడ్డారని విమర్శలొచ్చాయి. ఆ సమయంలో కొందరు షింజో అబేకి వ్యతిరేకంగా నిరసనలూ చేపట్టారు. అయితే ఇది ఆయన వ్యక్తిగత చరిష్మాపై పెద్దగా ప్రభావం చూపలేదు. 2012లోనే ఆయన ప్రధానిగా పదవి చేపట్టిన కొంత కాలానికే జపాన్ ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు. షింజో ప్రవేశపెట్టిన విధానాలు "అబెనామిక్స్"గా అక్కడ ప్రాచుర్యం పొందాయి. బిలియన్ల డాలర్లు దేశ ఖజనాలోకి వచ్చి పడ్డాయి. అప్పటి నుంచి ఆయన పేరు మారు మోగిపోయింది. ఉత్తర కొరియా పదేపదే క్షిపణుల దాడులు చేస్తామని బెదిరించినా, "మేమూ ఆ పని చేయగలం" అని చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు.