Sharad Pawar New party :  శరద్‌ పవార్‌ కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. శరద్ పవార్‌ వర్గం మూడు పేర్లు, ఎన్నికల గుర్తులను ఈసీ ఆమోదం కోసం పంపింది. వీటిలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ- శరద్‌చంద్ర పవార్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ -శరద్‌రావు పవార్‌, ఎన్సీపీ-శరద్‌ పవార్‌ పేర్లు ఉండగా.. ఎన్సీపీ -శరద్‌చంద్ర పవార్‌ పేరును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్‌సీపీ శరద్‌ చంద్రపవార్‌ పార్టీగా నామకరణం చేసింది.  టీ కప్పు, పొద్దుతిరుగుడు పువ్వు, ఉదయించే సూర్యుడు గుర్తులు పరిశీలించాలని ఈసీని కోరినట్లు శరద్‌ పవార్‌ వర్గం పేర్కొంది. వీటిలో ఓ గుర్తు ఖరారయ్యే అవకాశం                                         


లోక్‌సభ ఎన్నికల వేళ.. రాజకీయ దిగ్గజం శరద్‌ పవార్‌కు  మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం   బిగ్‌ షాక్‌ ఇచ్చింది. అజిత్‌ పవార్‌ వర్గాన్నే అసలైన ఎన్సీపీ(NCP)గా గుర్తిస్తూ.. గడియారం గుర్తును ఆ వర్గానికే కేటాయించింది. ఎస్పీపీ ఎవరిదనే విషయంలో గత కొంతకాలంగా ఆ పార్టీ చీలిక వర్గాలు  ఈసీ వద్ద పోరాటం చేశాయి.                                                                                    


ఎన్సీపీకి మొత్తంగా 53మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజత్‌ వర్గం చీలిక తర్వాత శరద్‌ పవార్‌ ఆ పార్టీపై క్రమంగా నియంత్రణ కోల్పోతూ వచ్చారు. ప్రస్తుతం ఆయనకు 12మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నారు.  గతేడాది ఎన్సీపీ నుంచి చీలిపోయి మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే-బీజేపీ సర్కారుకు మద్దతు పలికిన అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.  ఈ క్రమంలో ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలూ మంత్రులయ్యారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. చివరికి అసలైన ఎన్సీపీ శరద్ పవార్ చేతి నుంచి చేజారిపోయింది.                                              


ఫిబ్రవరి నెలాఖరులో రాజ్యసభ ఎన్నికలతోపాటు త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ పేరు, ఎన్నికల గుర్తును ఎంచుకోవాలని శరద్‌ పవార్‌ వర్గాన్ని ఈసీ కోరింది. బుధవారం సాయంత్రం 3 గంటలలోగా మూడు పార్టీల పేర్లు, గుర్తుల ప్రతిపాదనలు పంపాలని సూచించింది. అయితే అజిత్‌ వర్గానికే ఎన్సీపీ చెందుతుందన్న ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలని శరద్‌ పవార్‌ వర్గం భావిస్తున్నది.