Operation Sindoor: పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసుకునేందుకు ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్ తర్వాత కేంద్రం మరింత అప్రమత్తంగా ఉంటోంది. అన్ని సైనిక విభాగాలను యాక్టివేట్ చేసింది. పాకిస్థాన్ ఎలాంటి దుశ్చర్యకైనా దిగొచ్చన్న సమాచారంతో ఫుల్ ప్రిపేర్డ్‌గా ఉంది భారత్. అర్థరాత్రి నుంచి ప్రదానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి వివిధ వర్గాలతో అత్యవసర భేటీలు నిర్వహిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ తదుపరి చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు.
వివిధ వర్గాలను అప్రమత్తం చేసే క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న సీఎంలు, డీజీపీలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. అత్యవసరంగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీజీపీలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
అందర్నీ అప్రమత్తం చేస్తున్నాం: రేవంత్ రెడ్డి
కేంద్రం ఆదేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వెళ్తున్న టైంలోనే మీడియాతో మాట్లాడుతూ ఆర్మీ తీసుకున్న చర్యతో భారతీయుల గర్వపడుతున్నారని అన్నారు. ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన ఆర్మీకి ప్రతి భారతీయుడు బాసటగా నిలువాలని సూచించారు. సీఎంగా తన బాధ్యత నిర్వర్తిస్తున్నానని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్కటిగా ఉండాల్సిన సమయం ఇదని తెలిపారు. రాజకీయాలు కాదు దేశం ముందు... దేశంలోకి వచ్చి చంపుతుంటే చూస్తూ ఉరుకుంటే ఎలా అని ప్రశ్నించారు. భారత రక్షణ రంగంలో హైదరాబాద్ అత్యంత కీలక ప్రాంతం అని... అన్ని విభాగాలను అప్రమత్తం చేస్తున్నట్టు వెల్లడించారు.
ఆర్మీకి మద్దతుగా గురువారం హైదరాబాద్‌లో ర్యాలీ
సైన్యానికి అండగా ఉన్నామని చెప్పేందుకు గురువారం ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ ర్యాలీకి అన్ని పార్టీలు రావాలని రాజకీయాలకు అతీతంగా ర్యాలీలో పాల్గొనాలని ముఖ్యమంత్రి సూచించారు. భద్రతా కారణాల దృష్ట్యా తాను ఇవాళ్టి మాక్ డ్రిల్‌లో పాల్గొనడం లేదని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యూపీ డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర పౌరుల భద్రతకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాలని అన్నారు. కీలకమైన ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని చెప్పారు. సీఎం ఆదేశాలతో యుపి డిజిపి ప్రశాంత్ కుమార్ అన్ని జిల్లాలు, కమిషనరేట్లు, పోలీసు యూనిట్లతో మాట్లాడారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పెంచాలని చెప్పారు.