UP Minister  Orders Transfer Of Differently Abled Doctor He Fails To Welcome  :   మంత్రులంటే ప్రజా సేవకులు. ప్రజలతో సేవలు చేయించుకునేవాళ్లు కాదు. కానీ కొంత మంది మంత్రులు మాత్రం తమను గెలిపించి నెత్తిన పెట్టుకున్నారు కాబట్టి తమకు సేవలు చేయాల్సిందేనని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాడే ఈ యూపీ మంత్రి. 

ఉత్తరప్రదేశ్ మంత్రి సంజీవ్ గోండ్ ఒక ఆసుపత్రిలో ప్రారంభోత్సవం కోసం వెళ్లారు. అక్కడ ఓ  వైద్యుడు తనకు స్వాగతం చెప్పడానికి రాలేదు. వెంటనే వికలాంగుడైన వైద్యుడిని తన నియోజకవర్గం నుండి "ఏదో ఓ అటవీ ప్రాంతానికి " బదిలీ చేయాలని ఆదేశించారు. అత్యవసర వైద్యం అవసరమైన ఓ రోగికి తాను చికిత్స చేస్తున్నానని ఆ డాక్టర్ చెప్పినప్పటికీ మంత్రి వినిపించుకోలేదు. రోగికి వైద్యం కన్నా తనకు సేవలు చేయడమే ముఖ్యమని అనుకున్నాడు.  

ఈ సంఘటన సోన్‌భద్ర జిల్లాలోని ఓబ్రాలోని దిబుల్‌గంజ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో జరిగింది. సాంఘిక సంక్షేమం , షెడ్యూల్డ్ కులాలు ,గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి అయిన గోండ్ బుధవారం సౌర విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించడానికి ఆస్పత్రికి వచ్చారు. మంత్రిని ఆయన మద్దతుదారులు ,  కొంతమంది సిబ్బంది ఆహ్వానించారు. అదే సమయంలో ఆసుపత్రి వైద్య సూపరింటెండెంట్ డాక్టర్ రవి సింగ్  కూడా మంత్రి కార్యక్రమానికి గైర్హాజర్ అయ్యారు. 

దీంతో మంత్రికి తనకు మర్యాదలు సరిగ్గా జరగలేదని కోపం వచ్చిందది.  ఆస్పత్రికి ఎవరు  ఇన్‌ఛార్జ్ అని  సోన్‌భద్ర చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు ఫోన్ చేసి అడిగారు. తాను వస్తున్నా ఎవరూ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.  అతని ప్రవర్తన సరిగ్గా లేదని..తాను వచ్చినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆ సమయంలో రోగికి చికిత్స చేసిన వచ్చిన వైద్యులు పదే పదే వివరణలు ఇచ్చినప్పటికీ గోండ్ అతన్ని నియోజకవర్గం నుండి  బదిలీ చేయాలని ఆదేశించారు. 

 "అతన్ని బయట పంపండి... ఏదో అడవికి... మీరు నా నియోజకవర్గంలో ఇలాంటి వారిని ఎందుకు ఉంచుతున్నారు? అతన్ని వేరే చోటికి పంపండి... అతనికి ప్రజలతో ఎలా మాట్లాడాలో తెలియదు. అతను రోగులతో కూడా అలాగే ప్రవర్తిస్తుండవచ్చు" అని గోండ్ .. ఉన్నతాధికారికి ఆదేశాలిచ్చిన వీడియో వైరల్ గా మారింది.  

ఈ విషయం దుమారం రేగడంతో తాను వస్తున్నట్లుగా డాక్టర్ కు తెలియదని..తెలిస్తే స్వాగతం చెప్పేవాడని చెప్పుకొచ్చారు.  పేదలు ఇతర ప్రాంతాల నుండి కూడా అక్కడికి వెళతారు కాబట్టి ఆసుపత్రిలో సౌకర్యాలు బాగుండేలా చూసుకోవాలని తాను చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ను కోరానన్నారు. ఆ డాక్టర్ పేదలను బాధపెట్టాడని చెప్పుకొచ్చారు. వైద్యుడిని కించ పరిచిన మంత్రిపై కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు మండిపడ్డాయి.