Mangaluru International Airport Bomb Threat:
మంగళూరు ఎయిర్‌పోర్ట్‌కి బెదిరింపులు..
మంగళూరు ఎయిర్‌పోర్ట్‌కి (Mangaluru International Airport) బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. కొందరు ఆగంతకులు ఎయిర్‌పోర్ట్‌లోని ఓ ఫ్లైట్‌లో బాంబు పెట్టామంటూ మెయిల్ చేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సెక్యూరిటీ చెక్ నిర్వహించింది. Funning అనే గ్రూప్ నుంచి పలు ఎయిర్‌పోర్ట్‌లకు ఇవే బెదిరింపులు వచ్చాయి. xonocikonoci10@beeble.com నుంచి ఈ మెయిల్స్ (Bomb Threat Emails) వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఓ ఉగ్రసంస్థ ఈ బెదిరింపులకు పాల్పడినట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. "ఎయిర్‌పోర్ట్‌లోని ఓ విమానంలో పేలుడు పదార్థాలు పెట్టాం. ఎయిర్‌పోర్ట్‌లనూ బాంబు పెట్టాం. ఎవరూ కనిపెట్టకుండా జాగ్రత్తగా దాచిపెట్టాం. మరికొద్ది గంటల్లో అవి పేలతాయి. అందరినీ చంపేస్తాం. మాదో టెర్రరిస్ట్ గ్రూప్. పేరు Funning" అని మెయిల్ పంపారు గుర్తు తెలియని వ్యక్తులు. డిసెంబర్ 27న ఉదయం 11 గంటల సమయంలో ఈ మెయిల్ వచ్చింది. వెంటనే ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన పోలీసులు అన్ని చోట్లా తనిఖీలు చేశారు. చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. చెక్ పోస్ట్‌ల వద్దా తనిఖీలు నిర్వహించారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ అన్ని చోట్లా పరిశీలించింది. ఎక్కడా అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు ఎయిర్‌పోర్ట్ యాజమాన్యంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ బెదిరింపులపై కేసు నమోదు చేశారు.
ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీ నుంచి పుణేకి వస్తున్న విస్టారా ఫ్లైట్‌లో బాంబు పెట్టామంటూ ఓ ఆగంతుకుడు కాల్ చేసి బెదిరించడం అలజడి రేపింది. GMR కాల్ సెంటర్‌కి కాల్ చేసి ఫ్లైట్‌లో బాంబు పెట్టామని ఎవరో బెదిరించారు. వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఫ్లైట్‌ని ఐసోలేట్ చేసింది. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. లగేజ్‌నీ కిందకి దించింది. విమానంలో తనిఖీలు చేపట్టారు. ఉదయం 8.53 గంటలకు ఈ బెదిరింపు కాల్ వచ్చింది. అయితే...ఇప్పటి వరకూ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు ఫ్లైట్‌లో కనిపించలేదు. లోపల, బయట పూర్తిగా పరిశీలించిన సిబ్బంది పేలుడు పదార్థాలు ఏమీ లేవని చెప్పాక అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో కావాలనే ఈ కాల్ చేసుంటారని, ఫేక్ అయ్యుంటుందని భావిస్తున్నారు. ఫేక్ కాల్‌గా ప్రకటించారు. ప్రస్తుతానికి ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై FIR నమోదు చేశారు. ఫేక్ కాల్ చేసిన వ్యక్తి ఆచూకీని కనిపెడతామని వెల్లడించారు.
బెంగళూరులో ఒకేసారి 15 స్కూళ్లకు బాంబు బెదిరింపులు (Bengaluru Schools Bomb Threat) రావడం కలకలం సృష్టించింది. అన్ని స్కూల్స్‌కీ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈమెయిల్స్ వచ్చాయి. ఫలితంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముందుగా ఏడు స్కూల్స్‌కి బెదిరింపులు వచ్చాయి. బసవేశ్వర్‌నగర్‌లోని రెండు పాఠశాలల యాజమాన్యాలు ఈ బెదిరింపులతో వణికిపోయాయి. కర్ణాటక డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ ఇంటి ముందే ఉన్న స్కూల్‌కీ ఇవే బెదిరింపులు రావడం మరింత ఆందోళన కలిగించింది. అప్పటికే పోలీసులు అప్రమత్తమయ్యారు. విచారణ చేపడుతుండగానే మరో 7 స్కూల్స్‌కి ఇవే మెయిల్స్ పంపారు. బాంబు పెట్టామని బెదిరించారు. అయితే...ఎక్కడా బాంబు పెట్టిన దాఖలాలు కనిపించలేదు.
Also Read: Liberia Blast: ఆఫ్రికాలో ఘోర ప్రమాదం, ఆయిల్ ట్యాంకర్ పేలి 40 మంది మృతి