Oil Tanker Blast in Liberia:



ట్యాంకర్ పేలుడు..


పశ్చిమాఫ్రికాలోని లైబీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఫ్యుయెల్ ట్యాంకర్‌ పేలుడు ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. టొటోటాలో ఈ ప్రమాదం సంభవించింది. ఆయిల్ ట్యాంకర్‌ ప్రమాదానికి గురవడం వల్ల ఉన్నట్టుండి పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి 40 మంది బలి అయ్యారు. మరికొంత మంది గాయపడ్డారు. పదుల సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. వేగంగా వెళ్తున్న ట్యాంకర్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు ఆయిల్‌ కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఆ సమయంలోనే ట్యాంకర్‌లో పేలుడు సంభవించింది. పెట్రోల్ కోసం వచ్చిన వాళ్లలో 40 మంది సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని అదుపు చేశారు. మృతదేహాల్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్లే పదేపదే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మిగతా ప్రాంతాలతో పోల్చి చూస్తే ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటోంది. ఐక్యరాజ్యసమితి స్వయంగా ఈ విషయం వెల్లడించింది. అయినా ఈ సమస్య తీరడం లేదు. ఈ ప్రమాదంలో 80 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. వీడియో ఫుటేజ్‌లను పరిశీలిస్తే...కొంత మంది స్థానికులు ట్యాంకర్ ఎక్కి బకెట్ల ద్వారా పెట్రోల్‌ని తోడేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలోనే పేలుడు సంభవించింది.