Farmers Protest in Delhi: రైతుల ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను భారీగా పెంచారు. ఢిల్లీ-నోయిడా సహా చిల్లా సరిహద్దు వద్ద భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మొహరించాయి. అన్ని సరిహద్దుల్నీ 24 గంటల పాటు మూసేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. సెక్షన్ 144  విధించారు. ఈ కారణంగా ఢిల్లీలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. Rapid Action Force కూడా రంగంలోకి దిగి పరిస్థితులు అదుపు తప్పకుండా చర్యలు తీసుకుంటోంది. డ్రోన్స్‌ సాయంతో అన్ని చోట్లా నిఘా పెడుతోంది. ఎక్కడికక్కడే రైతులను ఆపేశారు పోలీసులు. ఫలితంగా చాలా చోట్ల రహదారులు బ్లాక్ అయ్యాయి.





నిత్యం రద్దీగా ఉండే ఢిల్లీ రహదారులు...ఈ ఆందోళనలతో మరింత రద్దీగా మారాయి. మూడేళ్ల క్రితం ఇదే విధంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. రైతు చట్టాలని వ్యతిరేకిస్తూ అప్పట్లో నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి ఆందోళనలు చేస్తున్నారు. అటు హరియాణా, యూపీలోనూ ఈ నిరసనల్ని అడ్డుకునేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. బ్యారియెర్‌లు పెట్టి అడ్డుకుంటున్నారు. పలు చోట్ల కంచెలు ఏర్పాటు చేశారు. నోయిడా, గ్రేటర్ నోయిడాలో రైతులు ఎన్నో నెలలుగా ఆందోళనలు చేపడుతున్నారు. రైతుల భూములను సేకరించిన అధికారులు వాటికి సరైన విధంగా పరిహారం చెల్లించలేదని మండి పడుతున్నారు. తమ డిమాండ్‌ని నెరవేర్చాలంటూ పార్లమెంట్‌ వైపు మార్చ్‌కి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే పోలీసులు అడ్డుకున్నారు. 


"అన్ని సరిహద్దుల్నీ వచ్చే 24 గంటల పాటు మూసేస్తున్నాం. సెక్షన్ 144 విధించాం. అన్ని సరిహద్దు ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రైతులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాం. అన్ని వాహనాలనూ తనిఖీ చేస్తున్నాం"


- పోలీస్ ఉన్నతాధికారులు