రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా సమయంలో పెంచిన రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మహమ్మారి వేళ స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు టికెట్ ధరను రూ.50గా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అన్రిజర్వ్డ్ ఎక్స్ప్రెస్, సాధారణ రైళ్లను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాట్ఫామ్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా తగ్గించిన ధరల ప్రకారం.. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లల్లో ప్లాట్ఫామ్ టికెట్ ధర రూ.10, సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లలో ప్లాట్ఫామ్ ధర మాత్రం రూ.20 ఉంటుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. కొవిడ్ మాదర్గదర్శకాలతో పాటు ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలను యథావిధిగా పాటిస్తూ రైల్వే యాజమాన్యానికి సహకరించాల్సిందిగా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సి.హెచ్ రాకేశ్ కోరారు.
గత ఏడాది జనవరిలో మనదేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. కేరళలో మొదటి కేసు నమోదయ్యింది. అప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై కరోనా వైరస్ నివారణ కోసం చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది మార్చి 22 నుంచికేంద్రం ప్రభుత్వం లాక్ డౌన్ కూడా విధించాయి. అనంతరం అంచెలంచెలుగా లాక్ డౌన్ ను సడలించింది. ఓ వైపు కరోనా నివారణ కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో పాటూ... కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరిస్తూ ఉంది. సెకెండ్ వేవ్ విజృంభించడంతో పలు రాష్ట్రాల్లో లాక్ డైన్...రాత్రివేళల్లో కర్ఫ్యూ వంటి చర్యలు చేపట్టారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కరోనా వ్యాప్తికి చెక్ పెట్టడంలో భాగంగా మాస్కులు లేకుండా రోడ్డు మీదకు వచ్చినా.. బస్సుల్లో రద్దీ ప్రదేశాల్లో కనిపించినా వెయ్యి రూపాయల ఫైన్ వేసింది. అదే సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీ ని నియంత్రించేందుకు ప్లాట్ ఫార్మ్ టికెట్స్ ధరలను పెంచింది. అప్పటికే 30 రూపాయలు ఉన్న ప్లాట్ ఫామ్ టికెట్ ధర 50 రూపాయలకు పెంచారు.
అయితే ప్లాట్ ఫామ్ ధర 30 రూపాయలు పెంచిన రైల్వేశాఖ..అప్పట్లో ఆ ధరలు తాత్కాలికంగా మాత్రమే పెంచినట్టు చెప్పింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం తమ బాధ్యత అన్న రైల్వే శాఖ ... రైల్వేస్టేషన్లలో జనం విచ్చలవిడిగా గుమిగూడటాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తాజాగా కరోనా సెకెండ్ వేవ్ కల్లోలం నుంచి బయటపడడంతో రైల్వేశాఖ.... పెంచిన ప్లాట్ ఫాం ధరలు తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. ఎప్పటిలా యథావిధిగా ప్లాట్ ఫాం టిక్కెట్ ధర 10 రూపాయలకు తగ్గించారు. అయితే సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లలో మాత్రం 50 రూపాయలు ఉన్న ధర ఇకపై 20 రూపాయలు ఉండనుందని చెప్పారు అధికారులు...