Congress AAP Seat Sharing: లోక్‌సభ ఎన్నికల ముందు (Lok Sabha Elections 2024) ప్రతిపక్షాలన్నీ సీట్‌ల షేరింగ్ విషయంలో చర్చలు కొనసాగిస్తున్నాయి. I.N.D.I.A కూటమిలో అన్ని పార్టీలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించాయి. ఈ క్రమంలోనే ఆప్, కాంగ్రెస్ మధ్య సానుకూల చర్చలు జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ సీట్ షేరింగ్ విషయం ఓ కొలిక్కి వచ్చినట్టే అని తెలుస్తోంది. ABP News సోర్సెస్ ప్రకారం...ఢిల్లీలో ఆప్ నాలుగు స్థానాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుండగా...కాంగ్రెస్ మూడు చోట్ల పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు తుది దశకు వచ్చాయి. న్యూ ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీలో ఆప్ పోటీ చేయనున్నట్టు సమాచారం. తూర్పు ఢిల్లీ, ఈశన్య ఢిల్లీ, చాందినీ చౌక్ లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. అటు యూపీలోనూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీకి మధ్య సయోధ్య కుదిరింది. యూపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ అవినాశ్ పాండే ఈ విషయం వెల్లడించారు. యూపీలో కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేయనుంది. సమాజ్‌వాదీ పార్టీ (SP) 63 స్థానాల్లో పోటీ చేయనుంది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ యూపీలో పొత్తు కుదరడంలో ప్రత్యేకంగా చొరవ చూపించారు. ఎస్‌పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇన్నాళ్ల సస్పెన్స్‌కి తెరదించారు.
"యూపీలో పొత్తుల విషయంలో ఓ స్పష్టత వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ షేరింగ్ కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్ 17 చోట్ల పోటీ చేయనుంది. సమాజ్‌వాదీ పార్టీ 63 స్థానాల్లో పోటీ చేస్తుంది. I.N.D.I.A కూటమిలో భాగంగా ఈ పొత్తు కుదిరింది"
- అవినాశ్ పాండే, యూపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్
ఇటీవల అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అరవింద్ కేజ్రీవాల్ భారీ మద్దతుతో విజయం సాధించారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఇటీవలే ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. ఈ నేపథ్యంలోనే ఆయన బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజల ఓట్లు అడిగే ధైర్యం ఉందా అంటూ ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీయే విజయం సాధించినప్పటికీ ప్రజలకు ఆ పార్టీ నుంచి విముక్తి కల్పించే బాధ్యతను తమ పార్టీయే తీసుకుంటుందని తేల్చి చెప్పారు. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి ఈ లక్ష్యాన్ని సాధిస్తామని స్పష్టం చేశారు. బీజేపీకి అతిపెద్ద ముప్పు ఆప్ నుంచే ఉందని తీవ్రంగా విమర్శించారు. అందుకే...అన్ని రకాలుగా తమ పార్టీని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఆప్ పార్టీని స్థాపించి 12 ఏళ్లు దాటిందని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,350 పార్టీలున్నాయని గుర్తు చేశారు. 2012 నవంబర్ 26వ తేదీన రిజిస్ట్రేషన్‌కి అప్లై చేసినట్టు వివరించారు. ప్రస్తుతం బీజేపీ కాంగ్రెస్ తరవాత మూడో అతి పెద్ద పార్టీగా ఆప్ అవతరించిందని స్పష్టం చేశారు.