Cloudburst in Himachal Pradesh: కేరళలోని వయనాడ్ విధ్వంసంతోనే అంతా సతమతం అవుతుంటే అటు హిమాచల్ ప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు, వరదలు ఆందోళన కలిగిస్తున్నాయి. షిమ్లాలోని రామ్‌పూర్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా 50 మంది గల్లంతయ్యారు. షిమ్లాతో పాటు మండి, కులు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకూ ఇద్దరి మృతదేహాల్ని గుర్తించారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఈ మూడు జిల్లాలకూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరో ఆరు జిల్లాలను భారీ వరదలు ముంచెత్తే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేసింది. కంగ్రా, కులు, మండి, షిమ్లా, చంబా, సిర్మౌర్‌లో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఉత్తరాఖండ్‌లోనూ క్లౌడ్ బరస్ట్‌లతో భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే 12 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే...వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల రెస్క్యూ ఆపరేషన్‌కి సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రభావిత ప్రాంతాల నుంచి చాలా మంది వేరో చోటకు వెళ్లిపోతున్నారు. NDRF తో పాటు SDRF బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. ఉత్తరాఖండ్‌లో 13 మంది మృతదేహాలను గుర్తించారు. మరో 16 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. 






ఉత్తర కాశీకి ఆరెంజ్ అలెర్ట్ జారీ అయింది. ఉత్తరాఖండ్‌లోని 12 జిల్లాలకూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ ఈ విపత్తుపై స్పందించారు. కేంద్ర హోం శాఖ అన్ని విధాలుగా సాయం అందిస్తామని భరోసా ఇచ్చినట్టు వెల్లడించారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు సుఖ్వీందర్ సింగ్ సుఖు స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఆరా తీస్తున్నారని తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఏరియల్ సర్వే చేశారు. గత మూడు రోజులుగా కేదార్‌నాథ్ యాత్రపై ఆంక్షలు విధించారు. పలు చోట్ల రోడ్లు చీలిపోయాయి. అప్పటికే యాత్ర చేస్తున్న 450 మందిని సురక్షితంగా వేరే ప్రాంతానికి తరలించారు. ఇప్పటి వరకూ 2 వేల మందికి పైగా కాపాడారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో మూడు జాతీయ రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 450 రహదారులు బ్లాక్ అయ్యాయి. మరో 24 గంటల పాటు ఇదే స్థాయిలో వర్షాలు కురిసే అవకాశముందని IMD వెల్లడించింది. 






Also Read: Viral News: ఈదురు గాలులకు కుప్ప కూలిన భారీ హోర్డింగ్, రెప్పపాటులో తప్పించుకున్న మహిళ - వీడియో