26th August 2024 School News Headlines Today:
నేటీ ప్రత్యేకత
- నేడు శ్రీ కృష్ణాష్టమి
- అమెరికా ఖండాన్ని కనుగొన్న క్రిష్టొఫర్ కొలంబస్ జననం
- పోలియో వ్యాధికి టీకా మందును కనుగొన్న వైద్యుడు ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్ జయంతి
- మానవతావాది, కరుణామయి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీద మదర్ థెరిస్సా జయంతి
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు:
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే యువతకు చేయూత ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. వీరి కోసం ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం EDP అనే కొత్త కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రణాళిక రచిస్తోంది. యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది.
- విశాఖలో నేటి నుంచి అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాల అభ్యర్థులు ఈ ర్యాలీకి తరలివచ్చారు. ఈ ర్యాలీ సెప్టెంబర్ 5 వరకు జరగనుంది. రోజుకు వెయ్యి మందికి చొప్పున ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, స్టోర్ కీపర్, ఆఫీస్ అసిస్టెంట్ విభాగాల్లో ఎంపికలు జరగనున్నాయి.
తెలంగాణ వార్తలు:
- రుణమాఫీ కాని వారికి తెలంగాణ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. అర్హులై రుణమాఫీ కాని రైతుల వివరాల నమోదుకు 'రైతు భరోసా పంట రుణమాఫీ యాప్'ను తీసుకొచ్చింది. రేపటి నుంచి వారి వివరాలను నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది. రూ.2లక్షల లోపు మాఫీ కాని వారి రుణఖాతాలు, ఆధార్ కార్డు తనిఖీ చేసి కుటుంబసభ్యుల వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేయాలని పేర్కొంది.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. సాయంత్రం దాదాపు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
- తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
జాతీయ వార్తలు:
- కోల్‌కతా హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతా గణేష్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి వేడుకల్లో లైట్లు, అలంకరణలకు దూరంగా ఉండాలని కోల్‌కతా గణేశ్ కమిటీలు నిర్ణయించాయి. ‘అత్యాచారానికి వ్యతిరేకంగా పోరాటం’ అనే థీమ్‌తో పూజలు చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
- ప్రధాని నరేంద్ర మోదీని ఇస్లామాబాద్‌కు పాకిస్తాన్ ఆహ్వానించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇస్లామాబాద్ వేదికగా నిర్వహించనున్న కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశానికి మోదీతో సహా షాంఘై సహకార సంస్థకు చెందిన ఇతర నేతలను ఆహ్వానించింది. పాకిస్తాన్‌తో సమస్యాత్మక సంబంధాల నేపథ్యంలో అక్కడికి వెళ్లడానికి మోదీ సిద్ధంగా లేరని తెలుస్తోంది.
- మోదీ సర్కారుపై రైతు, కార్మిక సంఘాలు మరోసారి పోరుబాట పట్టనున్నాయి. నవంబర్ 26న దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు ప్రకటించాయి. పంటలకు MSPతో పాటు రైతుల ఇతర డిమాండ్లను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించాయి. బడ్జెట్‌లోనూ పట్టించుకోలేదని రైతు సంఘాలు మండిపడ్డాయి.
క్రీడా వార్తలు:
టెన్నిస్ క్యాలెండర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి న్యూయార్క్ వేదికగా ఈ టోర్నీ ప్రారంభం కానుంది. నేటి నుంచి పురుషుల, మహిళల సింగిల్స్ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. పురుషులలో డిఫెండింగ్ చాంపియన్‌గా సెర్బియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ బరిలోకి దిగుతుండగా.. మహిళల నుంచి అమెరికాకు చెందిన కోకో గాఫ్ బరిలోకి దిగుతోంది.
మంచిమాట
- ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య." నెల్సన్ మండేలా