23nd August 2024 School News Headlines Today: 

నేటి ప్రత్యేకత:


  • నేడు భారత అంతరిక్ష దినోత్సవం

  • ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం జయంతి


జాతీయ వార్తలు: 


  • చంద్రయాన్-3 మిషన్ విజయాన్ని పురస్కరించుకుని నేడు జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకొంటారు. భారతదేశం ఈ మైలురాయి సాధన, చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగడాన్ని గుర్తు చేసుకుంటూ భారత్ మండపంలో రెండు రోజులపాటు ఈ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. అలాగే 'స్పేస్ ఆన్ వీల్స్', భారతీయ అంతరిక్ష్ హ్యాకథాన్ వంటి విద్యా కార్యక్రమాలు భవిష్యత్తులో అంతరిక్ష ఆవిష్కర్తలకు స్ఫూర్తినిస్తాయి. 

  • ఆదాయపు పన్ను శాఖ 165 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 'మై స్టాంప్'ని విడుదల చేశారు. ఈ స్టాంప్ చాణక్యుడి ఆర్థిక శాస్త్రం నుంచి ఆధునిక యుగం వరకు పన్నుల పరిణామం, ప్రయాణాన్ని చూపుతుంది. అలాగే దేశ అభివృద్ధిలో పన్నుల ముఖ్యమైన పాత్రను స్టాంప్ హైలైట్ చేస్తుంది. 

  • పంజాబ్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భారీ షాకిచ్చింది. పాత వ్యర్థాలు, మురుగునీటి విసర్జన నిర్వహణపై కచ్చితమైన చర్యలు తీసుకోనందుకు రూ.1,026 కోట్ల జరిమానా విధించింది. పంజాబ్‌లో ప్రస్తుతం 53.87 లక్షల టన్నుల పాత వ్యర్థాలు పడి ఉన్నాయని పేర్కొంది. 

  • హోంవర్క్ చేయమని పిల్లల వెంటపడే తల్లిదండ్రులు ఇకపై విశ్రాంతి తీసుకోనున్నారు. యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఓ బీటెక్ విద్యార్థి తల్లిదండ్రుల టెన్షన్‌ని తీర్చే బ్యాగ్‌ని తయారు చేశాడు. ఈ బ్యాగ్ పిల్లలు తప్పిపోకుండా ఉండటమే కాకుండా వారి హోంవర్క్ చేయమని గుర్తు చేస్తుంది. ఈ స్మార్ట్ ట్రెక్కింగ్ బ్యాగ్‌ను మొదటి సంవత్సరం కంప్యూటర్ సైన్స్ విద్యార్థి తయారు చేశారు. 


 

ఆంధ్రప్రదేశ్‌ వార్తలు: 


  • ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిష్టాత్మక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2800 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే అంశంపై సీఎం చంద్రబాబుతో  గోద్రెజ్ ఎండీ నాదిర్‌ గోద్రెజ్‌ చర్చలు జరిపారు. పెస్టిసైడ్స్ తయారీ రంగంలో వైజాగ్‌, అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు గోద్రెజ్‌ ఆసక్తిగా ఉంది. 

  • అచ్యుతాపురం సెజ్‌ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ వేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. కంపెనీలో SOP సరిగ్గా పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహార చెక్కులను పంపిణీ చేశారు. ప్రజల భద్రతకు రాష్ట్రంలోని పరిశ్రమలు ప్రాధాన్యం ఇవ్వాలని, రెడ్‌ క్యాటగిరీలోని పరిశ్రమలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. 


 

తెలంగాణ వార్తలు:


  • కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రైతు రుణమాఫీకి వంద శాతం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని చోట్ల సాంకేతిక కారణాల వల్ల మాత్రమే రుణమాఫీ జరగలేదని తెలిపారు. త్వరలోనే ప్రతి రైతుకూ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 


అంతర్జాతీయ వార్తలు


  • బోట్స్‌వానాలోని కరోవే గనిలో 2,492 క్యారెట్ల వజ్రం లభ్యమైంది. ప్రపంచంలోనే ఇది రెండో అతిపెద్ద వజ్రమని లుకారా డైమండ్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. కరోవే గనిలో ఏర్పాటుచేసిన ఎక్స్‌-రే డిటెక్షన్‌ టెక్నాలజీ ఆధారంగా దీన్ని గుర్తించినట్లు పేర్కొంది. 1905లో దక్షిణాఫ్రికాలో వెలికితీసిన 3,106 క్యారెట్ల కల్లినల్‌ వజ్రం ప్రపంచంలోనే అతి పెద్దది. 

  • థాయ్‌లాండ్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. తొమ్మిది మందితో వెళ్తున్న విమానం చాచోంగ్‌సావోలోని అడవిలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది పర్యాటకుల జాడ కోసం వెతుకుతున్నారు.

  • బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో ఎంపీలకు జారీ చేసిన అన్ని దౌత్య పాస్‌పోర్ట్‌లను డాక్టర్ మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది. ఇందులో మాజీ ప్రధాని షేక్ హసీనా పాస్‌పోర్టు కూడా రద్దయింది. 

  •  


క్రీడా వార్తలు:


  • భారత టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ అర్చన కామత్‌ సంచలన ప్రకటన చేసింది. 24 ఏళ్ల వయసులోనే కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది. ఒలింపిక్స్‌లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుని భవిష్యత్తుపై ఆశలు రేపిన కామత్‌.. అనూహ్యంగా రిటైర్‌‌మెంట్‌ ప్రకటించింది. అర్చన ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లనుంది.


 

మంచిమాట

కష్టాలను ఎదిరించే దమ్ము, బాధలను భరించే ఓర్పు నీలో ఉంటాయో.. అప్పుడు నువ్వు గెలవబోతున్నావని అర్థం.