SC slams West Bengal government :కోల్‌కత ఆర్‌జీకర్ ఆస్పత్రి హత్యోదంతం తర్వాత.. పశ్చిమ బెంగాల్‌లోని మమత బెనర్జీ సర్కారు తీసుకునే అనేక చర్యలు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. మహిళా వైద్యురాలుపై దారుణం జరిగింది కాబట్టి మహిళా డాక్టర్లకు నైట్‌ షిఫ్ట్ డ్యూటీలు వేయొద్దంటూ తృణమూల్ కాంగ్రెస్‌ సర్కారు విడుదల చేసిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. మహిళల సమాన అవకాశాలు ఎందుకు దెబ్బతీసున్నారంటూ మండిపడింది. మహిళలకు కల్పించాల్సింది భద్రత కానీ.. వెసులుబాట్లు కాదని మమత సర్కార్‌కు సూచించింది. ఆర్‌జీకర్ ఆస్పత్రి దారుణకాండపై సుప్రీంలో మంగళవారం నాడు విచారణ జరగ్గా.. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం.. మహిళా వైద్యులకు సంబంధించి బెంగాల్ సర్కారు తీసుకున్న ఇలాంటి చర్యలపై ఆశ్చర్యంతో పాటు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆ నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని ఆదేశించింది. అన్ని సమయాల్లోనూ పని చేసేందుకు విమెన్ డాక్టర్లు సిద్ధంగా ఉన్నారన్న ధర్మాసనం.. 12 గంటలు దాటి మహిళలు డ్యూటీ చేయకూడదని తాము చెప్పలేమని వ్యాఖ్యానించింది.


ఆర్మీ, విమానయానంలో ఉన్న మహిళలకు కూడా నైట్‌ షిఫ్ట్‌లు వద్దంటారా..?


          మహిళా వైద్యులకు భద్రత కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్న ధర్మాసనం.. ఆ విషయంపై దృష్టి సారించకుండా.. రాత్రిళ్లు పని చేయొద్దని మీరెలా ఆదేశిస్తారంటూ నిలదీసింది. సైన్యంలోనూ మహిళలు ఉన్నారని .. వారితో పాటు మహిళా పైలట్లు కూడా రాత్రుళ్లు విధులు నిర్వహిస్తుంటారని.. వారిని కూడా ఆ విధులకు దూరంగా ఉండమని మీరు చెప్పగలరా అని మమత సర్కార్‌ను ప్రశ్నించింది. మగ వైద్యులతో పాటే మహిళలకు కూడా సహేతుకమైన డ్యూటీ గంటలు వేయాలని సూచించింది. కేంద్రం కూడా ఈ కేసులో తన వాదనలు వినిపించింది. మహిళా డాక్టర్లకు భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమ వల్ల కాదంటే కేంద్రం వారికి భద్రత కల్పించడానికి సిద్ధంగా ఉందని కేంద్రం తరపును వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్‌ తుషార్ మెహతా తెలిపారు. కోర్టు ఆదేశాలు పాటిస్తామన్న బెంగాల్ సర్కార్ తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌.. సవరణలతో కూడిన ఉత్తర్వులు విడుదల చేస్తామన్నారు.


ఆర్‌జీకర్ కేసు విచారణ లైవ్‌ స్ట్రీమింగ్ ఆపేది లేదన్న సుప్రీం కోర్టు:


          ఈ కేసు విచారణ లైవ్ స్ట్రీమింగ్‌ను ఆపాలంటూ బెంగాల్‌ సర్కార్ తరపు న్యాయవాది కపిల్‌ సిబల్ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈ కేసు విచారణను లైవ్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే.. ఈ కేసు విచారణలో పాల్గొంటున్న న్యాయవాదుల ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని.. ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న మహిళా లాయర్లకు బెదిరింపు మెసేజ్‌లు వస్తున్నాయని సిబల్ కోర్టు దృష్టికి తేగా అందుకు వారికి భద్రత కల్పించాలని .. ప్రజా ప్రయోజనం దాగున్న ఈ కేసును ప్రత్యక్ష ప్రసారం కాకుండా మాత్రం తాము అడ్డుకోలేమని కోర్టు చెప్పింది. విచారణ సందర్భంగా వైద్యురాలి హత్యోదంతం కేసు విచారణ స్టేటస్‌పై వాకబు చేసిన సుప్రీం కోర్టు.. ఆ వివరాలు తమకు అందించాలని సీబీఐని ఆదేశించింది. ఇదే కేసుకు సంబంధించి కరప్షన్‌ విచారణపై కూడా పురోగతి ఎంత వరకు వచ్చిందో ఆరా తీసింది. ఈ కేసుపై రాత్రింబవళ్లు పనిచేస్తున్న సీబీఐకు కొంత సమయం ఇస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.