Supreme Court on Joshimath Crisis:
హైకోర్టులో విచారణ జరుగుతోందిగా : సుప్రీం కోర్టు
జోషిమఠ్ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. స్వామి అవిముక్తేశ్వరానంద్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు అంగీకరించలేదు. ఇప్పటికే ఉత్తరాఖండ్ హైకోర్టులో దీనిపై విచారణ జరుగుతోందని తేల్చి చెప్పింది. ఉత్తరాఖండ్ హైకోర్టు చేపడుతున్న విచారణ సరిపోతుందని, ఇకపై దీనిపై ఎలాంటి పిటిషన్‌లు వేయాలన్నా ఆ కోర్టునే ఆశ్రయించాలని సూచించింది సర్వోన్నత న్యాయస్థానం. హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. "గతంలో వేసిన పిటిషన్‌లలో ఉన్న డిమాండ్‌లే ఇందులోనూ ఉన్నాయి. వాటిపై ఇప్పటికే విచారణ జరుగుతోంది" అని తేల్చి చెప్పింది సుప్రీం కోర్టు. అయితే పిటిషనర్ మాత్రం ఇది చాలా సీరియస్ మ్యాటర్ అని వాదించారు. భారీగా పరిశ్రమల్ని నెలకొల్పడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. అంతే కాదు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం తక్షణమే అక్కడి ప్రజలకు పరిహారం అందించి ఆర్థికంగా తోడ్పడాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు ప్రజలకు అన్ని విధాలా సాయపడాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు మాత్రం వీటిని పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పటికే హైకోర్టు జోషిమఠ్‌లో నిర్మాణాలు ఆపేయాలన్న ఆదేశాలు ఇచ్చినట్టు గుర్తు చేసింది.
మీడియాతో మాట్లాడొద్దు: ప్రభుత్వ ఆదేశాలు
జోషిమఠ్‌లోని స్థితిగతులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ఆ ఊరు ఊరే త్వరలోనే కుంగిపోతుందని ఇటీవలే ISRO తేల్చి చెప్పింది. శాటిలైట్ ఇమేజెస్‌తో సహా వివరించింది. దీనిపై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే National Disaster Management Authorityతో పాటు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇస్రోతో పాటు రాష్ట్రానికి చెందిన ఏ సంస్థైనా...
ఈ విషయమై మీడియాతో మాట్లాడకూడదని తేల్చి చెప్పింది. ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకూడదని ఆదేశించింది. జోషిమఠ్ పరిస్థితులపై సోషల్ మీడియాలోనూ ఎలాంటి పోస్ట్‌లు పెట్టకూడదని తెలిపింది. అనుమతి లేకుండా వివరాలు పంచుకోవద్దని పేర్కొంది. గత వారం ఇస్రో జోషిమఠ్ పరిస్థితులకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు వెలువరించింది. గతేడాది డిసెంబర్ 7వ తేదీ నుంచి ఈ ఏడాది జనవరి 8 మధ్య కాలంలో జోషిమఠ్ 5.4 సెంటీమీటర్ల మేర కుంగిపోయిందని వివరించింది. అయితే...దీనిపై ఉత్తరాఖండ్ మంత్రి ధన్‌సింగ్ రావత్ అసహనం వ్యక్తం చేశారు. ఇస్రో విడుదల చేసిన చిత్రాలను "విత్‌డ్రా" చేసుకున్నట్టు వెల్లడించారు. ఆ తరవాతే "మీడియాతో" మాట్లాడొద్దన్న ఆదేశాలు వచ్చాయి. జోషిమఠ్ పనుల్లో పాలు పంచుకుంటున్న వాళ్లు కూడా మీడియాకు ఎలాంటి వివరాలు ఇవ్వకూడదని తేల్చి చెప్పారు అధికారులు. ఈ ఆర్డర్‌పై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. ఇలాంటి ఆదేశాలతో అందరి గొంతు నొక్కేస్తున్నారని విమర్శిస్తున్నాయి. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. "జోషిమఠ్‌లో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియకుండా చేసే ప్రయత్నమిది" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Nepal Plane Crash: విమానాల్లో ఉండే బ్లాక్ బాక్స్‌లు ఎందుకంత కీలకం? ప్రమాదాల గుట్టు తేల్చేస్తాయా?