SC Refuses To Entertain Plea Regarding Construction Of Wall:


రామసేతు ఉన్న ప్రాంతం ప్రజలకు కనిపించడం కోసం అక్కడ గోడ నిర్మించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై స్పందిస్తూ.. అది పాలనా పరమైన వ్యవహారమని, ఈ అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉండాలని, కోర్టులు జోక్యం చేసుకోకుండా ఉండాలని వెల్లడించింది. గోడ నిర్మాణానికి ప్రభుత్వానికి ఎలా ఆదేశాలు ఇస్తారని పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది. పిటిషన్‌ను ప్రాతినిధ్యంగా పరిగణించాలని కోర్టు ప్రభుత్వానికి సూచించలేదని, పిటిషన్‌ను ప్రభుత్వానికి సమర్పించాలని కోర్టు పిటిషనర్‌కు సలహా ఇచ్చింది. 


అలాగే రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించాలని దాఖలైన మరో పిటిషన్‌తో తాజాగా దాఖలు చేసిన రామసేతు వద్ద గోడ నిర్మించాలని చేసిన పిటిషన్‌ను జత చేయాలని పిటిషన్‌ కోరడంతో సుప్రీంకోర్టు అందుకు కూడా నిరాకరించింది. గోడ నిర్మించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను హిందూ పర్సనల్‌ లా బోర్డు అధ్యక్షుడు అశోక్‌ పాండే సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా దాఖలు చేశారు. ఇప్పటికే భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిల్‌ పెండింగ్‌లో ఉందని గుర్తుచేసి, దానితో పాటు ఈ పిటిషన్‌ను కూడా జత చేయాలని కోరారు. కానీ సుప్రీంకోర్టు ఈ రెండు విషయాలకూ అంగీకరించలేదు. మత గ్రంథాల ప్రకారం సేతువును దర్శించడం వల్ల మోక్షం లభిస్తుందని విశ్వసిస్తున్నందున దానికి ప్రాముఖ్యత ఉందని పిల్‌లోని అభ్యర్థనలో పేర్కొన్నారు. 


రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో గతంలో పిల్‌ దాఖలు చేశారు. రామసేతు స్మారక చిహ్నమా? కాదా అనే అంశాన్ని తేల్చకుండా కేంద్ర జాప్యం చేస్తోందని ఆయన పిటిషనులో పేర్కొన్నారు. గత సంవత్సరం ఈ పిల్‌ను పరిశీలించిన సుప్రీం బెంచ్‌ దీనిపై కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అప్పుడు ఈ పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూద్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ హిమా కోహ్లీ ధర్మాసనం ఈ పిల్‌ను పరిశీలించింది.


రామసేతును ఆడమ్స్‌ బ్రిడ్జి అని కూడా పిలుస్తారు. ఇది తమిళనాడులోని ఆగ్నేయ తీరంలో ఉన్న పంబన్‌ ద్వీపం, శ్రీలంక వాయువ్య తీరంలోని మన్నార్‌ ద్వీపం మధ్య ఉన్న కట్టడం. రామాయణ కాలంలో రాముడు తన భార్య సీతను రక్షించడానికి వానరసేన సహాయంతో సముద్రంలో తేలియాడే రాళ్లతో రామసేతు అనే వంతెనను నిర్మించారని విశ్వసిస్తారు. దీనిపై ఎన్నో పరిశోధనలు కూడా జరిగాయి. అక్కడ మానవ నిర్మితమైన వంతెన ఉందని నిరూపించేలా ఎన్నో ఆధారాలను కూడా చూపించారు. అయితే ఈ వంతెన గురించి ఇలా చాలా కాలంగా వివాదం నడుస్తోంది.
Also Read: NewsClick: న్యూస్‌క్లిక్‌ జర్నలిస్టుల ఇళ్లల్లో పోలీసుల సోదాలు, చైనా నుంచి నిధుల ఆరోపణల నేపథ్యంలో దాడులు