SBI Usttav Deposit Scheme: ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నాడు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ప్రారంభించిన "ఉత్సవ్‌ డిపాజిట్‌" ప్రత్యేక పథకం గడువు ఇవాళ్టితో (2022 అక్టోబరు 28) ముగుస్తుంది. ఇదొక ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయి, అమృత మహోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ ప్రత్యేక పథకాన్ని స్టేట్‌ బ్యాంక్‌ ప్రకటించింది. 


స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా ప్రకటించిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పథకం కాబట్టి, కాస్త ఆకర్షణీయమైన రేట్లను SBI అందిస్తోంది. తక్కువ కాల వ్యవధికి ఎక్కువ వడ్డీ రేటును పొందాలనుకుంటే ఇదొక ఉత్తమ, సురక్షిత మార్గమని  బ్యాంకు వర్గాయి వెల్లడించాయి. సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లతో పోలిస్తే ఈ పథకం కింద ఇంకా ఎక్కువ వడ్డీ రేటును స్టేట్‌ బ్యాంక్‌ ఆఫర్‌ చేసింది. దీంతోపాటు మరికొన్ని ఇతర ప్రయోజనాలనూ అందిస్తోంది. ఆగస్టు 15న ప్రారంభమైన ఈ స్కీమ్‌.. 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలకు గుర్తుగా 75 రోజుల పాటు కొనసాగింది, ఇవాళ్టితో ముగుస్తుంది.






ఉత్సవ్‌ డిపాజిట్‌ వడ్డీ
ఉత్సవ్‌ డిపాజిట్‌ పథకం కింద చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కాల పరిమితి వెయ్యి రోజులు. దీనిపై బ్యాంక్‌ 6.10 శాతం వడ్డీ చెల్లిస్తుంది. వృద్ధులకు (సీనియర్‌ సిటిజన్స్‌) మరో అర శాతం (0.50%) ఎక్కువ వడ్డీ లభిస్తుంది. 


ఇప్పటికే డిపాజిట్‌ చేసినా లబ్ధి
NROలతో పాటు అన్ని దేశీయ టర్మ్‌ డిపాజిట్లను ఉత్సవ్‌ డిపాజిట్‌ కిందకు మార్చుకునే వెసులుబాటును స్టేట్‌ బ్యాంక్‌ కల్పించింది. కొత్త డిపాజిట్లతో పాటు రెన్యువల్స్‌కూ ఉత్సవ్‌ డిపాజిట్‌ పథకం వర్తిస్తుంది. అయితే, బ్యాంక్‌ ఉద్యోగులు & వృద్ధుల NRO డిపాజిట్లకు మాత్రం మార్పిడి సదుపాయం లేదు.


వడ్డీ జమ ఎప్పుడు?
ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద వడ్డీని ఎప్పుడు జమ చేయాలన్నది మీ ఇష్టం. మీరు ఎంచుకున్న కాలాన్ని బట్టి నెల, 3 నెలలు, 6 నెలలకు ఒకసారి వడ్డీ ఆదాయాన్ని మీ ఖాతాలో జమ చేస్తారు. ఈ ఆదాయం మీద TDS ఉంటుంది.


ప్రి-క్లోజ్‌ చేస్తే?
డిపాజిట్‌ కాల గడువు ముగియకుండా ముందుగానే తీసేసుకోవాలని భావిస్తే... సాధారణ డిపాజిట్లకు వర్తించే నిబంధనలే ఉత్సవ్‌ డిపాజిట్లకూ వర్తిస్తాయి. ప్రత్యేక పథకం కాబట్టి ప్రత్యేక బాదుడు ఏమీ ఉండదు. ఈ డిపాజిట్‌ మీద రుణ సౌకర్యాన్ని కూడా బ్యాంక్‌ కల్పించింది.


బ్రాంచ్‌కు వెళ్లాలా?
మీకు ఆసక్తి ఉండి, ఈ పథకం కింద డిపాజిట్‌ చేయాలంటే కచ్చితంగా బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో యాప్‌ ద్వారా కూడా డిపాజిట్‌ చేయవచ్చు.