AAP Delhi : కేజ్రీవాల్మంత్రివర్గంలో ఇద్దరు కొత్త మంత్రులు చేరబోతున్నారు. ఆప్ఎమ్మెల్యేలు సౌరభ్ భరద్వాజ్, అతిషిలను క్యాబినెట్లోకి తీసుకోవాలని కేజ్రీవాల్నిర్ణయించినట్లుగా తెలుస్తున్నది. ఈ మేరకు వారి ఇద్దరి పేర్లను ఢిల్లీ లెఫ్టినెంట్గవర్నర్కు పంపారని పార్టీ వర్గాలు తెలిపాయి. డిప్యూటీ సీఎం, మరో మంత్రి రాజీనామాలు ఆమోదించి 24 గంటలు కూడా గడవక ముందే కేజ్రీవాల్ఇద్దరు కొత్త ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని నిరణయించారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మరో మంత్రి సత్యేంద్ర జైన్ తాజాగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయగా.. మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ గత 9 నెలలుగా జైలులోనే ఉన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కేజ్రీవాల్ కేబినెట్లో ఎందుకున్నారంటూ బీజేపీ విమర్శలు చేస్తోది. ఈ క్రమంలో వారితో రాజీనామాలు చేయించారు.
తమ మంత్రులు పరిపాలన కారణాల వల్లనే పదవులకు రాజీనామా చేశారని, అంతేకానీ, రాజీనామా చేయడం ద్వారా తప్పును ఒప్పుకున్నట్లు కాదని ఆప్ ప్రకటించింది. మనీశ్ సిసోడియా రాజీనామా అనంతరం ఆయన నిర్వహిస్తున్న కీలకమైన ఆర్థిక శాఖ సహా 18 శాఖలను కైలాశ్ గహ్లోత్, రాజ్ కుమార్ ఆనంద్ లకు అప్పగించారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వంలో సీఎం కేజ్రీవాల్ సహా ఐదుగురు మంత్రులు మాత్రమే ఉన్నారు. తాత్కాలికంగానే పదవులకు దూరమవుతున్నానని, నిర్దోషులుగా తేలిన తరువాత మళ్లీ బాధ్యతలను స్వీకరిస్తానని మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రిగా 8 ఏళ్ల పాటు నిజాయితీగా, నిబద్ధతతో సేవలను అందించానని, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలను తేలేంత వరకు పదవులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. తనపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశముందన్నారు. తాను తప్పేం చేయలేదన్నది ఆ దేవుడికి తెలుసన్నారు.
డిల్లీలో డిప్యూటీ సీఎంగా సిసోడియా మొత్తం వ్యవహారాలు చక్క బెడుతున్నారు. ఆరోగ్యం, విద్య, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ), సర్వీసెస్, ఫైనాన్స్, పవర్, హోమ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌తో సహా 18 శాఖలను చూస్తున్నారు. ప్రత్యేకంగా ఏ మంత్రికి కేటాయించని శాఖలన్నింటిని కూడా ఆయనే నిర్వహిస్తున్నారు. విద్య , ఆరోగ్య శాఖలను విజయవంతంగా ముందుకు నడిపించి.. పార్టీ ప్రజాదరణ, ఎన్నికల విజయానికి దోహదపడిన సిసోడియా, సత్యేందర్ జైన్ అరెస్టు కావడం పార్టీలో సంచలనంగా మారింది. గతేడాది మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అప్పటి నుండి ఆయనకు బెయిల్ కూడా లభించడం లేదు.
సిసోడియా తాను మరికొన్ని నెలలు జైల్లో ఉండాల్సి వస్తుందని ఆయన ఫిక్సయ్యారు. తన అరెస్టుపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు కానీ.. ప్రయోజనం లేకపోయింది. హైకోర్టుకు వెల్లాలని .. సుప్రీంకోర్టు సూచించింది. ఈ పరిణామాలతో ఆయన ఇప్పుడల్లా రిలీజ్ కావడం కష్టమన్న అంచనాకు రావడంతో రాజీనామాలు చేయించినట్లుగా తెలుస్తోంది.