పాలస్తీనాకు చెందిన హమాస్‌, ఇజ్రాయెల్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పాలస్తీనాకు తన మద్దతును ప్రకటించారు. పాలస్తీనా అధ్యక్షుడు మహ్ముద్‌ అబ్బాస్‌ తో మాట్లాడినట్లు తెలిపారు. యుద్ధ పరిస్థితి విస్తరించకుండా నిరోధించడానికి తాను కృషి చేస్తున్నట్లు సౌదీ యువరాజు మీడియాకు తెలిపారు. సౌదీ అరేబియా పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ఉంటుందని, వారు గౌరవప్రదంగా జీవించడానికి, చట్టబద్ధమైన హక్కులు, వారి ఆశలు ఆకాంక్షలను, న్యాయమైన శాశ్వత శాంతిని సాధించడానికి వారికి అండగా ఉంటామని యువరాజు వెల్లడించినట్లు సౌదీ అధికారిక మీడియా తెలిపింది.


ఇజ్రాయెల్‌ను ఎన్నడూ ఎన్నడూ గుర్తించని సౌదీ అరేబియా, అమెరికాతో భద్రతా హామీలు, పౌర అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడంలో సహాయం పొందే ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించడానికి అంగీకరిస్తుందని ఊహాగానాలు వచ్చాయి. కాగా ఈ సమయంలో ఇజ్రాయెల్‌, పాలస్తీనాల మధ్యం యుద్ధం ప్రారంభమైంది. దీంతో మళ్లీ సంబంధాలు క్షీణించే పరిస్థితి ఏర్పడింది. గత నెలలో ఫాక్స్‌ న్యూస్‌తో మాట్లాడుతూ సౌదీ యువరాజు.. తమకు పాలస్తీనా అంశం చాలా ముఖ్యమైనదని తెలిపారు. ఇస్లాంలోని పవిత్ర స్థలాలు మక్కా, మదీనాలకు నిలయమైన సౌదీకి పాలస్తీనా సమస్య ముఖ్యమైనదని చెప్పారు. వారి సమస్యలను పరిష్కరించాలని, పాలస్తీనియన్ల జీవితాలను సులభతరం చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. సౌదీ యువరాజు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా, జోర్డాన్‌ రాజు అబ్దుల్లాతో కూడా ఈ సంక్షోభం గురించి ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం.


పాలస్తీనాకు చెందిన హమాస్‌ సంస్థ ఇజ్రాయెల్‌పై భీకర దాడులకు దిగింది. దీంతో ఇజ్రాయెల్‌ కూడా దాడులను తిప్పి కొడుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధం నడుస్తోంది. ఇరు వైపులా ఇప్పటికే 1600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌ వైపు 900 మంది మరణించగా, గాజా వైపు 680పైగా మృతి చెందారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు హమాస్‌కు గట్టి హెచ్చరిక చేశారు. తమ ప్రభుత్వం ఇప్పటికి 3 లక్షల మంది సైనికులను సమీకరించిందని చెప్పారు. ఇజ్రాయెల్‌ ఈ యుద్ధాన్ని ప్రారంభించలేదు, కానీ ఇజ్రాయెల్‌ దీనిని పూర్తి చేస్తుందని అన్నారు. 


గాజా స్ట్రిప్‌ను పరిపాలిస్తున్న హమాస్ ఉగ్రవాదులు శనివారం ఉదయం వేల రాకెట్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించారు. అంతేకాకుండా సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లోకి చొరబడి వందల మందిని కిడ్నాప్ చేశారు. ఆటవికంగా, అత్యంత కిరాతకంగా హత్యలు చేస్తున్నారు. 1948 ఇజ్రాయెల్ స్వాతంత్ర్య సమరాన్ని గుర్తుకు తెచ్చే విధంగా ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం ప్రారంభమైంది. ఈ హింసాకాండలో ఇజ్రాయెల్, హమాస్ రెండు వైపుల నుంచి 1600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. పౌరుల ప్రాణాలను రక్షించేందుకు హింస, దాడులకు ముగింపు పలకాలని ఇజ్రాయెల్‌ అంతర్జాతీయ మద్దతు కోరుతోంది. మరోవైపు ఇజ్రాయెల్‌ కూడా గాజాపై భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే తాము హమాస్‌కు సంబంధించిన చాలా ప్రాంతాలపై పట్టు సాధించినట్లు చెప్తోంది. గాజాలో తలదాచుకుంటున్న సుమారు 400 మంది హమాస్‌ ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు, పదుల సంఖ్యలో వారిని బందీలుగా పట్టుకున్నట్లు వెల్లడించింది.