Dimple Yadav: ఉత్తర్‌ప్రదేశ్ మొయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సమాజ్‌వాదీ పార్టీ నేత డింపుల్ యాదవ్ సోమవారం పార్లమెంట్‌లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన డింపుల్ యాదవ్‌ను పలువురు అభినందించారు.
భారీ మెజారిటీ
మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి డింపుల్ యాదవ్ 2.88 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో భాజపా అభ్యర్థిపై విజయం సాధించారు. డింపుల్ తన సమీప భాజపా అభ్యర్థి రఘురాజ్ సింగ్ షాక్యాపై 2.88 లక్షల ఓట్ల తేడాతో జయకేతనం ఎగురవేశారు.
ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 2019 ఎన్నికల్లో ములాయం 94 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో భాజపా అభ్యర్థి ప్రేమ్ సింగ్‌పై గెలుపొందారు. ఇప్పుడు డింపుల్‌కు 2,88,461 లక్షల మెజార్టీ లభించింది. సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటగా పిలిచే మెయిన్‌పురికి డిసెంబర్ 5న ఉప ఎన్నిక జరగగా.. 56 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఎస్పీకి 64.2 శాతం ఓట్లు రాగా.. భాజపాకు 34.1 శాతం ఓట్లు వచ్చాయి.
బాబాయ్- అబ్బాయ్
ఉత్తర్‌ప్రదేశ్‌లో కీలక రాజకీయ పరిణామం జరిగింది. ప్రగతి శీల సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు శివపాల్ సింగ్ యాదవ్ తిరిగి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
" మేము ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (లోహియా)ని సమాజ్‌వాదీ పార్టీలో విలీనం చేశాం. 2024లో ఐక్యంగా పోరాడతాం. నేటి నుంచి సమాజ్‌వాదీ పార్టీ జెండానే కారుపై ఉంటుంది. "
విభేదాలు
అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్ మధ్య విభేదాలు తలెత్తి ఎన్నోసార్లు విడిపోయారు. కానీ ఇటీవలి కాలంలో ఇరువురు కాస్త దగ్గరయ్యారు. తాజాగా మెయిన్‌పురి ఎన్నికల్లో డింపుల్ యాదవ్‌ను గెలిపించమని శివపాల్ యాదవ్‌ను అఖిలేశ్ కోరారు. దీంతో కీలకమైన ఉప ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తన బాబాయ్ శివపాల్ యాదవ్‌కు చెందిన ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.
శివపాల్ యాదవ్ 2018లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి విడిపోయారు. అఖిలేశ్ యాదవ్‌తో విభేదాల కారణంగా సొంత రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. 2017లో అఖిలేశ్ యాదవ్ ఎస్పీ పగ్గాలు చేపట్టిన తర్వాత శివపాల్ పార్టీ నుంచి బయటకు వచ్చారు.
Also Read: Sabarimala Darshan: శబరిమల అయ్యప్ప రికార్డ్- మూడు రోజుల్లో 3 లక్షల మందికి దర్శనం!