ప్రధాని మోదీ సర్కార్ నూతన వ్యవసాయ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చి నేటికి ఏడాది కావడంతో శిరోమణి అకాలీదళ్ సెప్టెంబర్ 17ను 'బ్లాక్ డే'గా ప్రకటించింది. కొత్త సాగు చట్టాలకు నిరసనగా దిల్లీలోని గురుద్వారా తాలాబ్‌గంజ్ సాహెబ్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహించాలని రైతులకు, పార్టీ కార్యకర్తలకు బాదల్ పిలుపునిచ్చారు. అయితే ఈ నిరసనలో పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
బాదల్, హర్ సిమ్రత్ కౌర్ అరెస్ట్..
అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించిన కారణంగా శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్‌సింగ్ బాదల్, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ సహా 11 మందిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
ఈ విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో దిల్లీ సహా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.