UNESCO World Heritage List: ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకో దేశంలోని మరో చారిత్రక కట్టడం పేరును చేర్చారు. కర్ణాటకలోని హోయసల ఆలయాలను కూడా ఈ జాబితాలో చేర్చినట్లు యునెస్కో వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బేలూర్‌, హళేబీడ్‌, సోమనాథ్‌ పుర ఆలయాలకు కలిపి యునెస్కో గుర్తింపు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో జరుగుతున్న 45వ "వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ"లో ఈ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌ లోని ‘శాంతినికేతన్‌’కు యునెస్కో గుర్తింపు దక్కిన మరుసటి రోజే కర్ణాటకలోని హోయసల ఆలయాలకు గుర్తింపు రావడం గమనార్హం. హోయసలకు యునెస్కో గుర్తింపు దక్కడంపై ప్రధాని మోదీ స్పందించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో హోయసలకు చోటు లభించడం దేశానికే గర్వ కారణం అని మోదీ తెలిపారు. హోయసల దేవాలయాల యొక్క కాలాతీత సౌందర్యం, సున్నితమైన హస్తకళ భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు మన పూర్వీకుల అసాధారణ శిల్ప నైపుణ్యాలకు నిదర్శనం అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. హోయసల పవిత్ర ఆలయాలు.. 2014 ఏప్రిల్‌ 15వ తేదీ నుంచే యునెస్కో పరిశీలన జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం వాటి పరిరక్షణ బాధ్యతలను ఆర్కియాలాజిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్వర్తిస్తోంది.