CM Jagan Kurnool Tour: కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరంలో రూ. 224.31 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. కరువు సీమను రతనాల సీమగా మారుస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా10,394 ఎకరాలకు సాగునీరు, డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజక వర్గాల్లోని ప్రజలకు త్రాగునీరు అందనుంది. డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని 77 చెరువులకు హంద్రీనీవా నీటిని మళ్లించి కరువు సీమ దాహార్తి తీర్చడంతో పాటు కృష్ణా జలాలతో సస్యశ్యామలం అవనున్నాయి. లక్కసాగరం ప్రారంభోత్సవం అనంతరం డోన్‌‌‌లో జరిగే బహిరంగ సభలో సిఎం పాల్గొంటారు.


అంతకు ముందు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌కు ఘన స్వాగతం లభించింది. కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన, రాష్ట్ర మంత్రులు గుమ్మనూరు జయరాం, అంబటి రాంబాబు, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, ఎమ్మెల్యే సుధాకర్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ సీఎంకు ఘన స్వాగతం పలికారు.  


హంద్రీనీవా నుంచి ఎత్తిపోతల పథకం
హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి మొదటి దశలో కర్నూలు జిల్లాలోని మెరక ప్రాంతాల్లో ఉన్న 77 చెరువులకు తాగు, సాగునీరు సరఫరా జరుగుతుంది. డోన్ నియోజకవర్గంలో 36 చెరువుల క్రింద 4,260 ఎకరాలు, పత్తికొండ నియోజకవర్గంలో 36 చెరువుల క్రింద 5,784 ఎకరాలకు నీరు అందుతుంది. ఆలూరు నియోజకవర్గంలో 3 చెరువులక్రింద 197 ఎకరాలు, పాణ్యం నియోజకవర్గంలోని 2 చెరువుల క్రింద 153 ఎకరాలు మొత్తం 77 చెరువుల క్రింద 10,394 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. 


ఈ ఎత్తిపోతల ద్వారా 4 నియోజక వర్గాలలోని ప్రజలకు తాగునీరు.. భూగర్భ జలాలు పెరగడంతో పాటు రైతులకు పుష్కలంగా పంటలు పండే అవకాశం లభిస్తుంది. వర్షాధారం మీద ఆధారపడిన కర్నూలు జిల్లా పశ్చిమ కరవు ప్రాంతంలోని రైతులకు చెరువులు నింపే కార్యక్రమం అని ప్రభుత్వం చెబుతోంది. హంద్రీ నీవా ప్రధాన కాలువపై కూర్మగిరి (అలంకొండ) వద్ద పంప్ హౌస్ నిర్మాణం చేపడతారు. 3X3, 800 HP మోటార్ల ద్వారా 1.4 టీఎంసీల  నీటిని 90 రోజులలో పంప్ చేసి 5.6 కిలోమీటర్లు ప్రెషర్ మెయిన్ ద్వారా కొండపై ఉన్న డెలివరి ఛాంబర్‌కు నీటి మళ్లించి మూడు గ్రావిటీ పైప్ లైన్ల ద్వారా నీటి మళ్లింపు సరఫరా చేస్తారు. 


గ్రావిటీ పైప్ లైన్-1 ద్వారా 22 చెరువుల క్రింద 4,217 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. గ్రావిటీ పైప్ లైన్-2 ద్వారా 16 చెరువుల క్రింద 3,018 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు. గ్రావిటీ పైప్ లైన్ - 3 ద్వారా ప్యాపిలీ బ్రాంచ్ ద్వారా 23 చెరువుల క్రింద 2,065 ఎకరాల ఆయకట్టుకు, జొన్నగిరి బ్రాంచ్ ద్వారా 7 చెరువుల క్రింద 830 ఎకరాల ఆయకట్టుకు సాగునీరిస్తారు. మొదట నిర్దేశించిన 68 చెరువులతో పాటు డోన్ నియోజకవర్గంలో 8, పత్తికొండ నియోజకవర్గంలో ఒకటి.. మొత్తం 9 చెరువులకు పైప్ లైన్ ద్వారా అదనంగా నీరు అందించే ఏర్పాటు చేశారు.