Khalistani Terrorist Murder: కెనడాలో ఇటీవల జరిగిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన సంచలన ఆరోపణలపై భారత్ స్పందించింది. జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తీవ్రంగా ఖండించారు. కెనడా ప్రధాని వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైనవని, ప్రేరేపితమైనవని అన్నారు. సర్రేలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ హత్యలో భారత్ పాత్ర ఉందనడాన్ని తోసిపుచ్చారు. భారత దేశానికి చట్టబద్ధమైన పాలన పట్ల బలమైన నిబద్ధత ఉందని మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.
'కెనడా పార్లమెంటులో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి చేసిన ప్రకటన చూశాం. కెనడాలో ఏదైనా హింసాత్మక చర్యలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందనే ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవి, ప్రేరేపితమైనవి' అని విదేశాంగ శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో కేంద్రమంత్రి జైశంకర్ పేర్కొన్నారు.
ఇదే ఏడాది జూన్ లో సర్రేలోని గురుద్వారా ఎంట్రన్స్ వద్ద ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. జలంధర్ లో హిందూ పూజారిని చంపిన కేసులో ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ కు చెందిన నిజ్జర్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకటించింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ పై రూ. 10 లక్షల రివార్డు కూడా ఉంది. నిజ్జర్ హత్య కేసులో ప్రమేయం ఉందన్న కారణంతో కెనడా అగ్రశ్రేణి భారత దౌత్యవేత్తను బహిష్కరించినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. ఆ దౌత్యవేత్త పేరును మాత్రం కెనడా వెల్లడించలేదు.
ఈ క్రమంలో హౌస్ ఆఫ్ కామన్స్ లో మాట్లాడిన కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో.. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ పాత్ర ఉందని ఆరోపణలు చేశారు. ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను చంపిన కేసులో భారత ఏజెంట్లకు సంబంధం ఉందని దీనికి సంబంధించి తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని తెలిపారు. హత్యోదంతంపై భద్రతాత సంస్థలు సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కెనడా పౌరుడి హత్యలో విదేశీ ప్రభుత్వ ప్రమేయం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అది ఉల్లంఘనే అని ప్రకటించారు. ఈ కేసు విషయంలో భారత ప్రభుత్వం సహకరించాల్సిందిగా కెనడా ప్రధాని కోరారు. ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 సదస్సు సమయంలోనూ ఈ విషయాన్ని భారత ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తెలిపారు.