Sachin Pilot :  రాజస్థాన్ కాంగ్రెస్ లో  అంతర్గత సంక్షోభం మరో కొత్త పార్టీ ఆవిర్భావానికి కారణం అవుతోంది.  కాంగ్రెస్ పాలిత రాష్ట్రం అయిన రాజస్థాన్ లో.. కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలెట్ ఆధ్వర్యంలో కొత్త పార్టీ ఏర్పాటు కానుంది. ఇప్పటికే కొత్త పార్టీపై సచిన్ పైలెట్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని.. జూన్ 11వ తేదీని అధికారికంగా ప్రకటిస్తారని ఆయన వర్గీయులు మీడియాకు సమాచారం ఇచ్చారు.  కొత్త పార్టీ పేర్లు కూడా బయటకు వచ్చాయి. ప్రోగ్రెసివ్ కాంగ్రెస్ పేరుతోపాటు.. రాజ్ జన సంఘర్ష పార్టీ అనే పేర్లను పరిశీలిస్తున్నారు. జూన్ 11వ తేదీ తండ్రి రాజేష్ పైలెట్ జయంతి  రోజు.. ప్రతి ఏటా ఆ రోజు తన అభిమానులతో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయటం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంలోనే కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు సచిన్ పైలెట్ వర్గం  చెబుతోంది.                   


సచిన్ పైలట్ చాలా కాలంగా .. రాజస్తాన్ సీఎం గెహ్లాట్ పై అసంతృప్తిగా ఉన్నారు. పార్టీతో సంబంధం లేకుండా ఉద్యమాలు చేస్తున్నారు.     ఆయన పెట్టే మీటింగులు, చేపట్టే కార్యక్రమాలన్నీ అశోక్ గెహ్లాట్ ను ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి.  సొంత పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన జైపూర్లో ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. ఎప్పుడో దిగిపోయిన  బీజేపీ ప్రభుత్వ అవినీతిపై గెహ్లాట్ చర్యలు తీసుకోలేదని పైలట్ ఆరోపించారు. ఇలాంటి చర్యలతో పార్టీ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని చెప్పినప్పటికీ పైలట్ పట్టించుకోలేదు.                                                                              


సచిన్  పైలట్ ను కాంగ్రెస్ హైకమాండ్  బుజ్జగించింది. ఖర్గే అటు పైలట్.. ఇటు గెహ్లాట్ తోనూ చర్చలు జరిపారు. ఇద్దరి మధ్య కర్ణాటక తరహాలో అధికార పంపిణీ  చేసి రాజీ కుదిర్చారన్న ప్రచారం జరిగిది. కానీ అంతలోనే కొత్త పార్టీ ఏర్పాటుపై పుకార్లు ఊపందుకున్నాయి.  కాంగ్రెస్ పార్టీ కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపైనర్ల జాబితాలో ఆయన పేరును  చేర్చలేదు.  2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన స్టార్ క్యాంపైనర్ గా ఉన్నారు.   


కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే సచిన్ పైలట్ ఎటు పయనిస్తారన్న దానిపై కొంత కాలంగా చర్చ జరుగుతోంది.  ఒక సందర్భంలో ఆయన సింథియా తరహాలో బీజేపీలో చేరతారనుకున్నారు.  పైలట్ ను పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదని కేంద్ర హోం మంత్రి  అమిత్ షా పరోక్షంగా  చెప్పారు. అందుకే కాంగ్రెస్ నుంచి వేరుపడి సొంత కుంపటి పెట్టుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం.   2023 డిసెంబర్ లో రాజస్ధాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. 


రాజస్తాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సచిన్ పైలెట్.. డిప్యూటీ సీఎంగా కూడా పని చేశారు. కొన్నాళ్ల మంత్రి పదవికి రాజీనామా చేశారు. సీఎం అశోక్ గెహ్లాట్ తో ఉన్న విబేధాలతో.. ఇటీవలే పాదయాత్ర కూడా చేశారు. అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. సొంత పార్టీపై.. సీఎంపైనే తిరుగుబాటు చేశారు.ఇప్పుడు కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు రావటం.. రాజస్థాన్ రాజకీయాలను హాట్ టాపిక్ చేశాయి.. నిజంగానే జూన్ 11వ తేదీన సచిన్ పైలెట్ కొత్త పార్టీ ప్రకటిస్తారా లేదా అనేది వేచి చూడాలి.