Russia Nuclear Weapons:
బెలారస్‌కు తరలింపు..?
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై ఏడాది దాటింది. ఇంకా పరిస్థితులు ఓ కొలిక్కి రాలేదు. రెండు దేశాలూ ఇంకా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నాయి. రెండువైపులా నష్టం వాటిల్లుతున్నా వెనక్కి తగ్గడం లేదు. పైగా రానురాను మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఇరు దేశాల అధ్యక్షులూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పుతిన్ అయితే పదేపదే..అణుదాడులు చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. దీనిపై అంతర్జాతీయ సమాజమూ తీవ్రంగా స్పందించింది. ఈ చర్చ జరుగుతుండగానే ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. రష్యాకు చెందిన పది ఎయిర్‌క్రాఫ్ట్‌లు బెలారస్‌కు వెళ్లడం కలకలం రేపుతోంది. ఇవన్నీ అణ్వాయుధాలును మోయగలిగే సామర్థ్యం ఉన్నవే. బెలారస్‌లో అణ్వాయుధాలను మొహరించడం...చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదని పుతిన్ స్పష్టం చేస్తున్నారు. చట్టానికి లోబడి మాత్రమే ఈ పని చేశామని వెల్లడించారు. అంతే కాదు. అమెరికా కూడా ఇదే పని చేస్తోందంటూ ఎదురు దాడికి దిగారు. ఐరోపా మిత్ర దేశాల్లో తమ అణ్వాయుధాలను దాచి ఉంచారని ఆరోపించారు. పోలాండ్‌తో సరిహద్దు పంచుకుంటున్న బెలారస్‌లో రష్యా అణ్వాయుధాలు ఉండటం అంతర్జాతీయంగా ఆందోళన పెంచుతోంది. జులై 1వ తేదీ నాటికి బెలారస్‌లో న్యూక్లియర్ వెపన్స్ స్టోరేజ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రష్యా తేల్చి చెబుతోంది. రష్యాకు మద్దతుగా నిలుస్తున్న బెలారస్‌పై అమెరికా ఆంక్షలు విధించిన వెంటనే రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్‌లు అక్కడికి వెళ్లాయి. ఫలితంగా..రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరో స్థాయికి వెళ్తుందా..? అన్న అనుమానాలు, భయాలు వ్యక్తమవుతున్నాయి.