Russia Ukraine War:
ప్రతి ఇంచునీ కాపాడుకుంటాం: బైడెన్
ఉక్రెయిన్‌లోని నాలుగు కీలక ప్రాంతాలను రష్యా తన భూభాగంలో కలుపుకుంది. దీనిపై...అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే...రష్యాపై పలు ఆంక్షలు విధించిన అమెరికా...ఈ చర్యతో వాటిని ఇంకా కఠినతరం చేసింది. NATO దేశాల భూభాగాన్ని ఆక్రమించాలని చూస్తే...రష్యాపై తీవ్ర ప్రతిఘటన తప్పదని బైడెన్ మరోసారి గట్టిగా హెచ్చరించారు. "నాటో దళాలు సిద్ధంగా ఉన్నాయి. నాటో టెరిటరీలోని ప్రతి ఇంచునీ కాపాడుకుంటాం" అని స్పష్టం చేశారు. "మిస్టర్ పుతిన్. నేను చెప్పేది మీకర్థమవుతుందో లేదో. ప్రతి ఇంచు అని చెబుతున్నా" అని చాలా స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చారు బైడెన్. ఇంత సీరియస్‌గా ఆయన స్పందించటానికి మరో కారణం కూడా ఉంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తమ దేశాన్ని నాటోలో వీలైనంత త్వరగా కలిపేయాలని అప్లికేషన్ పెట్టుకున్నారు. ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనమైన నేపథ్యంలో జెలెన్‌స్కీ కాస్త తొందర పడుతున్నారు. అయితే...ఈ విషయమై బైడెన్...ఉక్రెయిన్‌కు ధైర్యం చెప్పారు. "పుతిన్ హెచ్చరికల్ని పట్టించుకోవద్దు" అని అంటున్నారు. "ఉక్రెయిన్ విషయంలో పుతిన్ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆయన చేసే పనులే చెబుతున్నాయి. అంత సులువుగా ఉక్రెయిన్‌ను ఆక్రమించలేరు. ఉక్రెయిన్‌కు మిలిటరీ ఎక్విప్‌మెంట్ అందించేందుకుఇప్పటికీ సిద్ధంగానే ఉన్నాం" అని బైడెన్ స్పష్టం చేశారు.
మోసపూరిత చర్య..
ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను రష్యాలో విలీనం చేయటాన్ని "మోసపూరిత చర్య"గా అభివర్ణించారు బైడెన్. అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించటంతో పాటు యూఎన్ చార్టర్‌కు కూడా పుతిన్ విలువ ఇవ్వలేదని మండిపడ్డారు. "ఉక్రెయిన్ అంతర్జాతీయ సరిహద్దుల్ని రక్షించుకునేందుకు అమెరికా ఎప్పుడూ సహకారం అందిస్తుంది. ఉక్రెయిన్ తన భూభాగాన్ని తిరిగి పొందేందుకు చేసే పోరాటంలో మేమూ అండగా ఉంటాం. ఇప్పటికే అమెరికా 1.1 బిలియన్ డాలర్ల సెక్యూరిటీ అసిస్టెన్స్‌ని అందిస్తున్నట్టు ప్రకటించింది" అని గుర్తు చేశారు. ఉక్రెయిన్‌కు ఎలాంటి అవసరం చేయాల్సి వచ్చినా ముందుండేది తామేనని స్పష్టం చేశారు. "నిబంధనలు ఉల్లంఘించి మరీ రష్యా యుద్ధానికి దిగటం సిగ్గుచేటు" అని గతంలోనే తీవ్రంగా వ్యాఖ్యానించారు బైడెన్. ఇదే సమయంలో అణుయుద్ధాల గురించి ప్రస్తావించారు. ఈ యుద్ధాన్ని రష్యా గెలవలేదని, సైనిక చర్యని నియంత్రించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఐరాస భద్రతా మండలి (UN Security Council)తో మాట్లాడిన సందర్భంలో మరి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు బైడెన్. "అణుయుద్ధాలు గెలవలేం. అసలు అలాంటి యుద్ధాలకు దిగటమే సరికాదు" అని అన్నారు. "బాధ్యతా రాహిత్యంగా అణుయుద్ధాల గురించి ప్రకటనలు చేస్తున్నారు" అంటూ రష్యాను విమర్శించారు.
టెహ్రాన్ (Tehran) అణ్వాయుధాలు సమకూర్చుకోవటాన్నీ అనుమతించేది లేదని స్పష్టం చేశారు బైడెన్. ఇదే సమయంలో ఐరాస భద్రతా మండలిని విస్తరించాలన్న ఆలోచనకు మద్దతునిచ్చారు. ఆఫ్రిరా, లాటిన్ అమెరికా ప్రాతినిధ్యమూ ఉండేలా
చూడాలన్న ప్రతిపాదనకు అంగీకరించారు. "శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య పెంచేందుకు అమెరికా ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుంది" అని ఐరాస జనరల్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు శాశ్వత సభ్యత్వం
ఇస్తే బాగుంటుందనీ అన్నారు. అమెరికా ఈ నిర్ణయానికి సపోర్ట్ చేస్తుందని చెప్పారు.