రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో భారీగా ప్రాణనష్టం జరుగుతోంది. ఇప్పటికే ఇరు దేశాలకు చెందిన 100 మందికి పైగా సైనికులు, ప్రజలు మృతి చెందారు. తాజాగా ఉక్రెయిన్‌కు చెందిన ఓ సైనిక విమానం రాజధాని కీవ్ నగరంలో కుప్పకూలింది. విమానంలో 14 మంది సభ్యులు ఉన్నారు. రష్యా గురువారం ఉదయం నుంచి ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోంది. 


ఈ ఘటనలో ఎంతమంది మరణించారనే విషయం ఇంకా తెలియలేదు. కీవ్ రాజధాని నగరానికి 20 కిమీ దూరంలో ఈ ప్రమాదం జరిగింది.


నాటో దేశాలు


ఉక్రెయిన్‌లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఉక్రెయిన్​, రష్యాకు సమీపంలోని తూర్పు ప్రాంతంలోని సరిహద్దుల్లో బలగాలను భారీగా పెంచేందుకు నాటో అంగీకారం తెలిపింది. ఉపరితల, వాయు, సముద్ర ప్రాంతాల్లో బలగాలను పెంచుతున్నాయి నాటో దేశాలు.


నాటోలోని 30 సభ్య దేశాలు ఇప్పటికే ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు ఇతర సామగ్రిని ఉక్రెయిన్​కు సరఫరా చేస్తున్నాయి. అయితే, ఉక్రెయిన్​కు మద్దతుగా నాటో దళాలు ఎలాంటి మిలిటరీ చర్యలు చేపట్టలేదు. ఉక్రెయిన్​కు అత్యంత సన్నిహత భాగస్వామి అయినప్పటికీ... యుద్ధంలో పాల్గొనే ఆలోచనలో లేదు నాటో.






మరోవైపు ఉక్రెయిన్‌లోకి భారీగా ఆయుధ సామగ్రిని, యుద్ధ వాహనాలను రష్యా తరలిస్తోంది. ఇందుకు సంబిధించిన సీసీటీవీ వీడియో విడుదలైంది.


అధ్యక్షుడి పిలుపు


దేశం కోసం పోరాడాలనుకునేవారికి మేం ఆయుధాలిస్తాం. ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండండి. మన నగర సరిహద్దుల్లో నిల్చొని దేశాన్ని కాపాడుకుందాం.  ఓ స్వతంత్ర దేశంపై రష్యా దురాక్రమణకు పాల్పడుతోంది. ప్రపంచ దేశాలు దీన్ని ఖండించాలి. ఉక్రెయిన్‌కు మద్దతు పలకాలి. నిజమైన స్నేహితులు ఎవరో ఇప్పుడే తెలుస్తుంది.                                       "


-జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు

Also Read: Ukraine Russia War: యుద్ధం అయిపోయాక రష్యా పరిస్థితేంటి? పుతిన్ వ్యాఖ్యలకు అర్థమేంటి?


Also Read: Russia Ukraine War: రష్యా విమానాలు, హెలికాప్టర్ కూల్చేశాం - ఉక్రెయిన్ ప్రకటన, వారి ఎయిర్ డిఫెన్స్ మొత్తం నాశనం చేశాం: రష్యా